నా వ్యాఖ్యలను వివాదం చేస్తున్నారు

ఇరవై ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను నేడు వివాదం చేస్తున్నారని చినజీయర్ స్వామి అన్నారు

Update: 2022-03-18 12:22 GMT

ఇరవై ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను నేడు వివాదం చేస్తున్నారని చినజీయర్ స్వామి అన్నారు. దాన్ని ఎడిటింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సమాజహితం లేనివారే ఇలాంటి అల్ప ప్రచారం చేస్తున్నారన్నారు. మనం సంప్రదాయాలను గౌరవించాలన్నారు. కొందరు సొంత లాభం కోసమే ఇలాంటి పనులు చేస్తుంటారని చినజీయర్ స్వామి అన్నారు. గ్రామదేవతలను తాను కించపర్చాననడం సరికాదని చెప్పారు.

ఏ సందర్భంలో చేశానో?
తమకు కులం, మతం తేడా లేదని చెప్పారు. ఈ మధ్య తనపై వచ్చిన ఆరోపణలు ఎలా వచ్చాయో తనకు తెలియదన్నారు. తాను ఎప్పుడూ అలాంటి దురుద్దేశ పూర్వకమైన వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాత్పర్యం తెలియకుండా ఆరోపణలు చేస్తే వారిపై జాలి పడాల్సి వస్తుందని చినజీయర్ స్వామి అన్నారు. తాను ఏం సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశానో పూర్వమూ, పరమూ తెలియకుండా వివాదం చేస్తున్నారని చెప్పారు. దేవతలను చిన్న చూపు చూసే అలవాటు తనకు ఎప్పుడూ లేదన్నారు. తాను ఎప్పుడూ ఎవరినీ దుర్భాషలాడలేదని చిన జీయర్ స్వామి చెప్పారు.
అన్నింటినీ నమ్మను...
మహిళలను చిన్న చూపు చూసే వారిని తాము ప్రోత్సహించనని చెప్పారు. జనంలో నుంచి వచ్చిన దేవతలను అడ్డం పెట్టుకుని అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించవద్దని స్వామీజీ కోరారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా వస్తారని చెప్పారు. అన్నింటినీ తాను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి పద్ధతుల్లో వారు ఉంటే మంచిదని చినజీయర్ స్వామి హితవు పలికారు. ఆదీవాసీల కోసం చినజీయర్ ట్రస్ట్ పాఠశాలలను ఏర్పాటు చేసి సేవ చేస్తున్నామని చెప్పారు.
రాజకీయాల్లోకి వెళ్లను...
ముచ్చింతల్ లో దర్శనానికి టిక్కెట్ పెట్టలేదన్నారు. అక్కడ జరిగే కార్యక్రమలకు కూడా టిక్కట్ పెట్టలేదన్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక కూడా తమకు లేదన్నారు. తమ పేరిట బ్యాంకు అకౌంట్లు కూడా ఉండవని చినజీయర్ చెప్పారు. సెన్సేషన్ కోసం వివాదం చేయడం కొందరికి పనిగా మారిందన్నారు. తాము సమాజానికి కళ్లులాంటి వాళ్లమని అన్నారు. మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టవద్దని చినజీయర్ స్వామి కోరారు. ఎవరికీ తాము దూరం కాదని, అలాగని దగ్గరా కాదని ఆయన అన్నారు.


Tags:    

Similar News