కమ్మోళ్లకు ఈసారి షాక్ తప్పదట

చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పొత్తులతో వెళ్లాలని నిర్ణయించారు

Update: 2022-01-10 06:26 GMT

చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పొత్తులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అదే సమయంలో సామాజికవర్గాల సమీకరణను కూడా ఆయన ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చేస్తారంటున్నారు. ముందుగా పార్టీ పై ఉన్న "కమ్మ" ముద్రను తొలిగించే ప్రయత్నాలు చేస్తారట. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి తక్కువ స్థానాలు దక్కే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పదిహేడు ఉంటే..
గుంటూరు లో 17 నియోజకవర్గాలున్నాయి. ఇందులో తాడికొండ, వేమూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు. ఇక పథ్నాలుగు నియోజకవర్గాలున్నాయి. ఇందులో పెదకూరపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరిపేట, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికే టిక్కెట్లు ఇచ్చారు. అంటే 14 నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో కమ్మ వారే అభ్యర్థులుగా నిలిచారు. గుంటూరు, నరసరావు పేట ఎంపీ అభ్యర్థులు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారు.
తొమ్మిదిలో...
పైగా ఇటీవల గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతను కూడా కమ్మ వారికే అప్పగించారు. అయితే ఈసారి ఎనిమిది స్థానాల్లో కమ్మవారిని పక్కన పెట్టి ఇతరులకు టిక్కెట్లు ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. జిల్లా వ్యాప్తంగా కులాలను తమ వైపునకు తిప్పుకోవాలంటే ఇతర కులాలకు ప్రాధాన్యత పెంచాలన్నది చంద్రబాబు నిర్ణయం. కమ్మవారిపై ఇతర కులాల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ తొమ్మిదిలో అన్నింటిలో కాకున్నా నాలుగైదు నియోజకవర్గాల్లో కమ్మ అభ్యర్థులకు చంద్రబాబు షాక్ ఇవ్వనున్నారు.
వైసీపీ తరహా వ్యూహం.....
ఒక కులం వారికి టిక్కెట్ ఇస్తే ఆ కులానికి చెందిన వారు జిల్లాలో పార్టీ అభ్యర్థులకు అండగా నిలబడతారు. గత ఎన్నికల్లో వైసీపీ ఈ వ్యూహంతో సక్సెస్ అయిందంటున్నారు. చిలకలూరిపేట, గుంటూరు వెస్ట్, పొన్నూలు, సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక జిల్లా మొత్తంపై పనిచేసిందన్న అంచనాలున్నాయి. అందుకే ఈసారి గుంటూరు జిల్లాలో కమ్మ వారికి చంద్రబాబు టిక్కట్లు ఎక్కువగా ఇవ్వడం కష్టమేనని చెబుతున్నారు. అధికారంలోకి రావాలంటే ఆ మాత్రం త్యాగాలు చేయకతప్పదు. ఆ సామాజికవర్గం ఓట్లు ఎటూ వెళ్లవని భావనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోనున్నారు.


Tags:    

Similar News