సెంటిమెంటు ఫలిస్తే...?

చంద్రబాబు నాయుడికి ప్రజల్లో విపరీతమైన ఆదరణ, ఎదురులేని జనాకర్షణ లేని మాట వాస్తవం. కానీ నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉంది

Update: 2021-11-20 03:43 GMT

'విశృంఖలమైన అధికారం నియంతృత్వానికి దారి తీస్తుంది. ప్రశ్నించే గొంతు లేకపోవడం పతనానికి బాటలు వేస్తుంది.'కేవలం నేటి రాజకీయాలకే కాదు, రామాయణ, భారత కాలం నుంచి నిరూపితమైన సత్యమిది. తాజాగా ఆంద్రప్రదేశ్ శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడి స్వీయసభా బహిష్కార ఘట్టాలు మరోసారి ఈ నానుడిని గుర్తు చేస్తున్నాయి. శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలలో తప్పొప్పులను పక్కనపెడితే.. ప్రతిపక్ష నాయకుడు తీవ్ర నిర్ణయం తీసుకొనే స్థాయిలో రెచ్చ గొట్టిన పాపం మాత్రం పాలకపక్షానిదే అని చెప్పకతప్పదు. రాజకీయాల్లో ఎవరూ పులుగడిగిన ముత్యం కాదు. అందులోనూ చంద్రబాబు అస్సలు కాదు. సొంతంగా జనంలో సమ్మోహక శక్తి లేకపోయినప్పటికీ , ఎత్తుగడలతో ఎదుగుదల తెలిసిన రాజకీయ ఘనాపాఠి. అందుకే వైసీపీ మంత్రులు, సభ్యులు అత్యుత్సాహంతో అందించిన అస్త్రాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ సెంటిమెంటుగా దానిని మలచుకోవాలని నిర్ణయించారు.


సానుభూతికి సావకాశం...

రాజకీయాల్లో బావోద్వేగాలు పక్కాగా పనిచేస్తాయి. ప్రతిపక్షనాయకుడికి అవమానం జరిగిందన్న విషయం ప్రజల్లో నిరంతరం నానుతూ ఎన్నికల వరకూ కొనసాగేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. నిజానికి సెంటిమెంటును వాడుకోని పార్టీ అంటూ లేదు. రాజశేఖరరెడ్డి సెంటిమెంటు, జగన్ కు అన్యాయం జరిగిందన్న భావనే వైసీపీ పుట్టుకకు ఆధారం. అదే సానుభూతి ఆయనను అధికారపీఠంపై కూర్చో బెట్టింది. చంద్రబాబు నాయుడు తన నేతృత్వంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పుడూ సెంటిమెంటే పనిచేసింది. కార్గిల్ భావోద్వేగాలు బీజేపీ ఖాతాలో పడకుండా తాను వాటిని అందిపుచ్చుకుని 1999లో గట్టెక్కారు. రాష్ట్ర విభజన సెంటిమెంటుతోపాటు మోడీ, పవన్ ల పాజిటివ్ ట్రెండ్ ను తన పార్టీకి సానుకూలంగా వినియోగించుకుని 2014లో మరోసారి అధికారంలోకి వచ్చారు. పూర్తి సొంతబలంతో కాకుండా అవకాశ వాద ఎత్తుగడలతో అధికారం తెచ్చుకోవడం ఎలాగో చంద్రబాబుకు తెలుసు. అందుకు అవసరమైన ముడిసరుకును అనుభవ రాహిత్యంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందిస్తున్నారు.

అధికారపక్షానికి అపాయం...

శాసనసభలో గంపగుత్తగా ఆధిక్యం కారణంగా ప్రతిపక్షం పేలవమైన ప్రదర్శననే చేయగలుగుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల్లో పెల్లుబుకే వ్యతిరేకతను భూతద్దంలో చూపిస్తుంది ప్రతిపక్షం. అందులోని నిజానిజాలను నిర్ధరించుకుని సరిదిద్దుకునే అవకాశం అధికారపార్టీకి ఉంటుంది. అలాకాకుండా ప్రతిపక్షం గొంతు నులిమేయాలనుకుంటే అంతిమంగా నష్టపోయేది అధికారపార్టీయే. ఏ అంశం మీదనైనా ముందుగా చర్చ ప్రారంభించేది , ముగించేది అధికారపక్షమే. బలాబలాల రీత్యా చూస్తే వైసీపీకి , టీడీపీ కంటే అయిదు రెట్ల సమయం శాసనసభలో లభిస్తుంది. ప్రతిపక్షం ఎంతగా తీవ్రమైన దాడిని కొనసాగించినా తగురీతిలో బదులిచ్చేందుకు వైసీపీకి చాలా సమయమే ఉంటుంది. వ్యక్తిగత దూషణలతో సభను దిగజార్చవలసిన అవసరం ఉండదు. ప్రతిపక్షానిది ఎప్పుడూ చిన్నపిల్లల మనస్తత్వమే. పేచీలు పెడుతుంది.. అనునయిస్తూ సభను సజావుగా నడపాల్సిన బాధ్యత అధికారపార్టీదే. ఆ కర్తవ్యాన్ని విస్మరించి అధినేత మెప్పుకోసం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు వీరంగం చేస్తే ప్రభుత్వం, పార్టీ నష్టపోతాయి.

ఇమేజ్ లేకపోయినా...

చంద్రబాబు నాయుడికి ప్రజల్లో విపరీతమైన ఆదరణ, ఎదురులేని జనాకర్షణ లేని మాట వాస్తవం. కానీ నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉంది. రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉంది. జాతీయ స్థాయిలోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాచుర్యం కలిగిన నాయకుడు. అతను శాసనసభలో మాట్టాడితే వైసీపీకి వాటిల్లే నష్టమేమీ లేదు. పదిమాటల్లో ఒక మాటనైనా చక్కగా వినియోగించుకోవచ్చు. వంద విమర్శల్లో ఒకటైనా అధికారపార్టీకి సూచనగా ఉపయోగపడుతుంది. ఇందుకు వైసీపీ సంయమనం పాటించాలి. అయినా చంద్రబాబు శాసనసభలో చేసే ప్రసంగాల వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. సభా వ్యవహారాలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రజల్లోకి వెళ్లి మాట్టాడితేనే అధికారపార్టీకి ఎక్కువ నష్టం. గతంలో జగన్ మోహన్ రెడ్డి శాసనసభను బహిష్కరించి ప్రజల బాట పట్టారు. ఎన్టీరామారావు, జయలలిత వంటి వారు కూడా అదే విధంగా ప్రజాక్షేత్రంలో ఘనవిజయాలు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తమ స్వయంకృతాపరాధాలతో చంద్రబాబు సెంటిమెంటు కార్డు ప్రయోగించే అవకాశాన్ని వైసీపీ నేతలు కల్పించారు. ప్రభుత్వ దురాగతాలను ఎండగట్టేందుకు ఇప్పుడు ఆయనకు అదో బ్రహ్మాస్త్రం కాబోతోంది.

రాజకీయాల డీఎన్ఏ...

అన్ని పార్టీలు, అందరు నేతలు ఆ తాను ముక్కలే. రాజకీయాల డీఎన్ఏ ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు రేపు మరో పార్టీలో తేలతారు. ఇప్పుడు స్థాయి మరిచి విద్వేషాగ్ని వెదజల్లుతున్న కొడాలి నాని రాజకీయ జీవితం పురుడు పోసుకున్నది చంద్రబాబు నాయుడి నాయకత్వంలోనే అన్న సంగతి మరిచిపోకూడదు. మంత్రి కన్నబాబు ప్రజారాజ్యంతో అరంగేట్రం చేసి కాంగ్రెసులో చేరి, వైసీపీలో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశంతోనూ మంతనాలు జరిపారనేది అందరికీ తెలిసిందే. ఎవరు, ఎఫ్పుడు, ఎక్కడ ఉంటారో తెలియని అనిశ్చిత రాజకీయ చిత్రంలో వ్యక్తిగత దూషణలు కక్షలు, కార్పణ్యాలకు దారి తీస్తాయి. వంగవీటి మోహనరంగా హత్య వెనక ఎవరున్నారు? వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేయించారు? వంటి అంశాలలో చర్చలు, దూషణలకు దిగి... దేవతా వస్త్రాలతో ప్రదర్శనలు అవసరమా? అన్నదే నేటి చర్చ. అయినా ఇప్పటికే రాజకీయాల దేహసౌందర్యం, డీఎన్ ఏ ల సంగతి ప్రజలకు బాగా తెలుసు. వ్యక్తిగత డీఎన్ ఏ లు వారికి అవసరం లేదు. అవి ఏరకంగానూ రాజకీయ పార్టీల నాయకులకు గౌరవమర్యాదలు ప్రసాదించవు.


Tags:    

Similar News