ఆ మాత్రం దానికి ఈ ఆపసోపాలు దేనికీ?

కష్టపడని వారికి టిక్కెట్ ఇవ్వం. ఈసారి సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా టిక్కెట్ల కేటాయిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.

Update: 2022-01-06 07:37 GMT

సరే మీరు చెప్పినట్లే అనుకుందాం. కష్టపడతాం. ఈ రెండున్నరేళ్లు పార్టీ జెండాను మోస్తాం. అప్పులు చేసి మరీ పార్టీని నిలబెడతాం. మరి మాకు టిక్కెట్ గ్యారంటీ ఇస్తారా? ఇదీ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ. చంద్రబాబు గత కొద్ది రోజులుగా ఒకే మాట అంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇదే రకంగా వ్యవహరిస్తారు. అది వేరే సంగతి. పార్టీ కోసం కష్టపడని వారికి టిక్కెట్ ఇవ్వం. ఈసారి సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.

టిక్కెట్లు ఇవ్వనంటూ..
రెండు రోజుల నుంచి పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాటలకు నేతలు భయపడిపోయారనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్లే. అందరూ లైట్ గానే తీసుకున్నారు. ప్రస్తుతమున్న పార్టీ పరిస్థిితికి, పార్టీ భవిష్యత్ పై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. వారు చంద్రబాబు మాదిరిగా ఫార్టీ ఇయర్ ఇండ్రస్ట్రీ కాకపోయినా వారి నియోజకవర్గాల్లో వారికి రాజకీయ అవగాహన ఉంది. తమకు కాకుండా వేరే వారికి టిక్కెట్లు ఇస్తే చంద్రబాబు తన గొయ్యిని తాను తవ్వుకున్నట్లే అని బహిరంగంగా కాకపోయినా అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీకి అసలు భవిష్యత్ ఉందా?
అన్నదే ఎవరూ అంచనా వేయలేక పోతున్నారు. సపోజ్... పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుందామని అనుకుందాం. ఇప్పుడున్న గెస్సింగ్ ప్రకారం జనసేన, కమ్యునిస్టు పార్టీలతో కలసి బరిలోకి చంద్రబాబు దిగాల్సి ఉంటుంది. ఆ పార్టీలకు కనీసం యాభై స్థానాలను కేటాయించాల్సి ఉంటుంది. ఇక బీజేపీ కూడా కలిస్తే మరో పది బొక్క. అంటే యాభై స్థానాలు అంతకంటే ఎక్కువ స్థానాల్లోనే టీడీపీ అభ్యర్థులు టిక్కెట్లు పొందలేరు.
పొత్తులు ఫిక్స్ అయితే?
ఆ మాత్రం దానికి ఇంత ఆపసోపాలు దేనీకీ అన్న వ్యాఖ్యలు పార్టీ నుంచి విన్పిస్తున్నాయి. సీనియర్ నేతలు తమ పరపతిని ఉపయోగించుకుని టిక్కెట్లు తెచ్చుకుంటారు. ఎటొచ్చీ నష్టపోయేది పైరవీలు, చొచ్చుకుని పోయే మనస్తత్వం లేనివాళ్లే. ఇప్పటికే జనసేనతో పాత్తు ఉంటుందని టీడీపీ నేతలు మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. జనసేన బలంగా ఉన్న చోట పార్టీ కార్యక్రమాలను పెద్దగా చేపట్టడం లేదు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. చంద్రబాబు తమకు టిక్కెట్ గ్యారెంటీ ఇస్తే అప్పో సొప్పో చేసి పార్టీ కోసం ఖర్చు చేస్తామంటున్నారు. మరి దీనికి చంద్రబాబు వద్ద సమాధానం ఉందా?


Tags:    

Similar News