BJP :ఇద్దరూ మాజీ ఎమ్మెల్సీలే.. ఇద్దరూ సీనియారిటీ.. సిన్సియారిటీలో ముందున్న వారే
భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్ష పదవికి విధేయులను ఎంపిక చేసింది
భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్ష పదవికి విధేయులను ఎంపిక చేసింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఇటీవల బీజేపీలో పెత్తనం సాగిస్తున్నారన్న కార్యకర్తల మనోభిష్టానికి అనుగుణంగా పార్టీతో సుదీర్ఘకాలం అనుబంధంగా ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేసింది. ట్రాక్ రికార్డు చూసి మరీ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న వారికి మాత్రమే పదవులను కట్టపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక చూస్తే ఇదే అర్థమవుతుంది. ఇద్దరిదీ బీజేపీతో అనుబంధం ఈనాటిది కాదు. పదవులు వచ్చినా రాకపోయినా జెండాను వదలకుండా పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారే కావడంతో వారినే అందలం ఎక్కించింది. దీంతో కమలం క్యాడర్ కూడా ఖుషీ అవుతుంది.
మాధవ్ ఎంపికతో...
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. మాధవ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికిచెందిన బీసీ సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన తండ్రి చలపతి రావు కూడా కొన్ని దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. చలపతిరావు పార్టీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతలందరికీ సుపరిచితులు. ఆయన కుమారుడే మాధవ్. మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్.విశాఖపట్నానికి చెందిన నేత. మాధవ్ 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తిరిగి 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. మాధవ్ కుటుంబం తొలి నుంచి కాషాయం కండువాను కప్పుకునే ఉండేది.
న్యాయవాది రామచందర్ రావును...
ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు పేరు ఖరారు అయింది. రామచందర్ రావు కూడా తొలి నుంచి బీజేపీ కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగారు. ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన నేత కూడా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థినేతగా ఎదిగి తర్వాత భారతీయ యువమోర్చా తొలి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా కూడా రామచందర్ రావు గతంలో న్యాయసేవలను అందించారు. రామచందర్ రావు 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి ఎమ్మెల్సీ అయ్యారు. పార్టీలో అనేక పదవులనుపొందిన ఎన్. రామచందర్ రావును పార్టీ అధ్యక్షుడిగాఎంపిక చేసింది. సీనియారిటీ,సిన్సియారిటీకి మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. ఇద్దరూ మాజీ ఎమ్మెల్సీలే కావడం విశేషం. ఇద్దరూ మరికాసేపట్లో నామినేషన్లను దాఖలు చేస్తారని పార్టీవర్గాలు వెల్లడించాయి.