జగన్ వదిలపెట్టరట.. సాధించడం గ్యారంటీ అట

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లులను ప్రవేశ పెట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది.

Update: 2022-08-06 06:23 GMT

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లులను ప్రవేశ పెట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం న్యాయనిపుణుల పరిశీలనలో ఈ బిల్లులు ఉన్నాయని సమాచారం. న్యాయస్థానాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావని న్యాయ నిపుణులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమయింది. ఇప్పటికే కొన్ని మార్పులు, చేర్పులు చేసి జగన్ దృష్టికి న్యాయ నిపుణుల బృందం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో నిపుణులు ఓకే చెప్పిన తర్వాత శాసనసభకు బిల్లుల రూపంలో రానుంది.

మూడు రాజధానుల ప్రతిపాదన....
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మూడు రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రెండేళ్లు పూర్తయింది. రాజధాని రైతులు దాదాపు వెయ్యి రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. న్యాయస్థానాలు వాటిని కొట్టిపారేశాయి. శాసనమండలిలో అప్పట్లో టీడీపీ బలంగా ఉండటంతో బిల్లు వీగిపోయింది. దీంతో గవర్నర్ చేత ఆర్డినెన్స్ తెచ్చినా అది న్యాయస్థానంలో నిలవలేదు. అమరావతి రాజధానిని పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆరు నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలని, అమరావతిని మూడు నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టుతో ....
అయితే జగన్ మాత్రం మూడు రాజధానుల వైపు మొగ్గు చూపుతున్నారు. తాను అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చినట్లు విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. న్యాయ రాజధాని విషయంలో హైకోర్టు, ప్రభుత్వం సంప్రదించుకుని ఏకాభిప్రాయంతో కర్నూలుకు తరలించే ప్రతిపాదనలను పంపాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది. ఇందుకోసం హైకోర్టు న్యాయమూర్తులతోనూ ప్రభుత్వం సంప్రదింపులు జరిపే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారని తెలిసింది. ఎన్నికలకు ముందుగానే కర్నూలుకు న్యాయరాజధానిని, విశాఖకు పరిపాలన రాజధానిని తరలించాలని జగన్ గట్టిగా భావిస్తున్నారు.
ప్రయివేటు బిల్లు...
తాజాగా నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజధానుల ఏర్పాటుపై ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టారు. రాజధానుల ఏర్పాటుపై శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో ఒక్కటి కంటే అంతకంటే ఎక్కువ రాజధానుల ఏర్పాటు చేసే అధకారం శాసన వ్యవస్థకే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న చట్టానికి ఆర్టికల్ 3 ఏని చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని విజయసాయిరెడ్డి ప్రయివేటు బిల్లు పెట్టారు. రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే శాసనసభకు రాజధానుల ఏర్పాటు పై మరింత వెసులుబాటు ఏర్పడుతుందని, రానున్న శాసనసభ ఎన్నికల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతారన్న సమాచారం పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది.


Tags:    

Similar News