Union Budget : దంపతులకు గుడ్ న్యూస్ చెప్పనున్న నిర్మలమ్మ..ఇక పన్ను చెల్లించక్కర్లేదుగా
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1వ తేదీన లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1వ తేదీన లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి కొత్త తరహా పద్ధతిలో ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు ఊరట లభించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో భార్యా భర్తలు ఉద్యోగం చేస్తున్నారు. లక్షల్లో నెలసరి ఆదాయం ఉంటుంది. అయితే ఒకే కుటుంబమయినా పన్ను రూపంలో భారీగా చెల్లించాల్సి వస్తుంది. అయితే నిర్మలమ్మ ఈసారి బడ్జెట్ లో మాత్రం భార్యాభర్తలకు ఆదాయపు పన్ను మినహాయింపులో భారీ ఊరట ఇచ్చే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి. దీనివల్ల పన్నుల భారం కుటుంబంపై తగ్గిపోవడమే కాకుండా మరొకరూపంలో దేశానికి ఆదాయం వచ్చే అవకాశముంది.
ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ తో...
మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివాహితుల కోసం "ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్" అనే కొత్త పన్ను విధానాన్ని తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తే, వారిని ఒక ఆర్థిక యూనిట్ గా పరిగణించి, ఉమ్మడి ఆదాయంగా ప్రకటించి, దానిపై పన్ను చెల్లించవచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో ఈ విధానం అమల్లో ఉంది. ఇది అమలులోకివస్తే దంపతుల పన్ను భారం తగ్గి, ఆర్థిక ప్రణాళిక మెరుగుపడుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ విధానాన్ని నిర్మలమ్మ దంపతులకు కొత్త పన్ను విధానాన్ని తీసుకు వచ్చే అవకాశాలున్నాయనిచెబుతున్నారు.
దీనివల్ల ఇతర రకాలుగా...
ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ విధానం ఇతర దేశాల్లో విజయవంతంమయింది. పన్నుల ఎగవేత జరగకుండా పకడ్బందీగా పన్నులు చెల్లింపు జరగడమే కాకుండా, దాని వల్ల ఇతర వస్తువుల కొనుగోళ్లపై దృష్టి పెడతారు. ఇళ్లు, స్థలాలు, కార్లు, బంగారం వంటివి ఎక్కువగా కొనుగోలు చేయడం వల్ల జీఎస్టీ రూపంలోనూ ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రానికి కూడా అత్యధికంగా ఆదాయం సమకూరే అవకాశముందని చెబుతున్నారు. అందువల్లనే ఈ సారి పన్ను చెల్లింపు పద్ధతుల్లో కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు అవసరమైన కసరత్తులు నిర్మలా సీతారామన్ ఇప్పటికే పూర్తి చేశారని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అదే నిజమైతే ఉద్యోగులుగా ఉన్న దంపతులకు భారీ ఊరట దక్కినట్లే.