ఆళ్ల మళ్లీ సర్దుకుపోవాల్సిందేనా?
ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో సీనియర్ నేత. జగన్ కు నమ్మకమైన లీడర్. లోకేష్ ను ఓడించి మరి మంగళగిరిలో రికార్డు సృష్టించారు
ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో సీనియర్ నేత. జగన్ కు నమ్మకమైన లీడర్. నారా లోకేష్ ను ఓడించి మరి మంగళగిరిలో రికార్డు సృష్టించారు. 2014లో పార్టీ అధికారంలోకి రాకపోయినా వైసీపీ నుంచి న్యాయస్థానంలో పోరాడి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టిన నేత. 2019 ఎన్నికల్లో తొలుత పోటీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి సుముఖత వ్యక్తం చేయకపోయినా జగన్ బలవంతం చేసి పోటీ చేయించారు.
మంత్రిని చేస్తానని.....
2019 ఎన్నికల్లో మంగళగిరిలో జరిగిన ప్రచారం సభల్లో కూడా జగన్ ఆళ్లను మంత్రిగా చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మంత్రివర్గం ఏర్పాటులో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. సామాజిక సమీకరణాల వల్ల ఆళ్లను పక్కన పెట్టారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆళ్ల కూడా తనకు మంత్రి పదవి రానందుకు అసంతృప్తి పడకుండా మంగళగిరిలో మరింత యాక్టివ్ అయ్యారు.
ఈసారి విస్తరణలో....
అయితే రెండోసారి విస్తరణలో తనకు చోటు దక్కుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి గట్టిగా భావిస్తున్నారు. కానీ గుంటూరు జిల్లాలో మళ్లీ సామాజిక సమీకరణాలే ఆళ్ల మంత్రి పదవికి అడ్డువచ్చే అవకాశముంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీనియర్ గా ఉన్నారు. వరస గెలుపులతో ఆయన మంత్రి పదవి రేసులో ముందున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలో ఇతర సామాజికవర్గాల వారికి మంత్రిపదవి దక్కే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. కాపు, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు చోటు దక్కుతుందంటున్నారు.
మళ్లీ అవే లెక్కలు....
అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజనీ, ముస్తాఫా పేర్లు ఆ యా సామాజికవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈసారి మంత్రి వర్గ విస్తరణలో బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అదే జరిగితే మరోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డికి నిరాశే ఎదురుకానుంది. ఆళ్ల సోదరుడికి రాజ్యసభ పదవి కూడా ఇవ్వడంతోనే మంత్రి పదవి పై ఆయన ఆశలు వదులుకున్నారని ఆళ్ల సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఆళ్ల రెండోసారి విస్తరణలో కూడా చోటుదక్కకున్నా సర్దుకుపోవాల్సిందేనంటున్నారు.