రేవంత్ ను తప్పించడం ఖాయమా?

ఎన్నికలకు ఏడాది ముందు తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ వచ్చే అవకాశాలున్నాయి. రేవంత్ రెడ్డిని తప్పిస్తారంటున్నారు.

Update: 2022-01-03 03:01 GMT

రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ ను మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధమయిందా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఎన్నికలకు ఏడాది ముందు కొత్త పీసీసీ చీఫ్ వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే హైకమాండ్ కు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు పుంఖాను పుంఖానుగా అందాయి. అయితే పార్టీ ఇన్ చార్జి మాణికం ఠాగూర్ ఈ ప్రతిపాదనను అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఏడాది కూడా....
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టి ఏడాది కూడా గడవలేదు. పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి దూకుడుగానే ఉన్నారు. వివిధ కార్యక్రమాలను తీసుకుని పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ధర్నాలకు దిగుతున్నారు. దీక్షలు చేస్తున్నారు. ఇక పాదయాత్రకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. హైకమాండ్ అనుమతితో తెలంగాణలో ఈ ఏడాది పాదయాత్ర చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు.
పాదయాత్రకు రెడీ అవుతున్న...
అయితే రేవంత్ రెడ్డి పార్టీకంటే వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీని తన జేబు సంస్థగా భావిస్తున్నారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. జగ్గారెడ్డి వంటి నేతలు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. రచ్చబండ వంటి పెద్ద కార్యక్రమాలను ఎవరికీ చెప్పకుండా చేపట్టారని ఆయన చెబుతూ ఇప్పటికే హైకమాండ్ కు కూడా లేఖ రాశారు.
వ్యతరేకిస్తున్న సీనియర్లు....
పార్టీలో ఎక్కువ మంది సీనియర్లు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. రేవంత్ పీసీసీ చీఫ్ గా కొనసాగితే వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ క అపజయం తప్పదని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వవద్దంటూ కొందరు ఇప్పటికే హైకమాండ్ కు చెప్పినట్లు సమాచారం. మాణికం ఠాగూర్ తో పాటు పీసీసీ చీఫ్ ను మార్చాలన్న డిమాండ్ కూడా పెరుగుతుంది. తెలంగాణలో ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు పార్టీని మరింత దిగజారుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. రేవంత్ రెడ్డిని తప్పిస్తే కాంగ్రెస్ పరస్థితి మరింత దిగజారిపోతుందన్నది కూడా వాస్తవం.


Tags:    

Similar News