గేమ్‌ ఛేంజర్‌... చరణ్‌ కాదు.. జగన్‌!!

భారీ బడ్జెట్‌ సినిమాలు తీసే క్రేజీ డైరెక్టర్‌ శంకర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌..

Update: 2023-08-20 07:18 GMT

భారీ బడ్జెట్‌ సినిమాలు తీసే క్రేజీ డైరెక్టర్‌ శంకర్‌, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌. శంకర్‌ సినిమాల్లో సామాజిక స్పృహ, సందేశం ఉంటాయి. గేమ్‌ ఛేంజర్‌ సినిమా కూడా నేటి దేశ, కాల, మాన పరిస్థితుల ఆధారంగా తీస్తున్నదే. సినిమాల పరంగా కావచ్చేమో కానీ సమకాలీన రాజకీయాల్లో మాత్రం గేమ్‌ ఛేంజర్‌ శంకర్‌ కాదు, చరణ్‌ కాదు. మరెవరు? ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని చెప్పడానికి ఏ మాత్రం సందేహించక్కర్లేదు.

ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తున్నప్పుడే జగన్‌ తన మ్యానిఫెస్టోకి రూపకల్పన చేశారు. నవ రత్నాలు అంటూ తన హామీలకు నామకరణం చేశారు. ఎన్నికల ఏడాది ముందు నుంచి వాటిని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ పథకాలన్నీ జనం నోళ్లలో నానేలా చేశారు. అదే సమయంలో తెలుగుదేశం మ్యానిఫెస్టో గురించి ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు 600 హామీలు ఇచ్చారని, వాటిని బుట్టదాఖలు చేశారని ఆరోపించారు. వీటికి సమాధానం చెప్పలేక తెలుగుదేశం పార్టీ తన మ్యానిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఈ విషయంలో ఇప్పటికీ తెలుగుదేశం ఇప్పటికీ తన చర్యను సమర్థించుకోలేకపోతోంది.

అలాంటి తప్పు చేయకూడదని భావించిన జగన్‌ తన పరిపాలనంతా తన మ్యానిఫెస్టో చుట్టూనే కేంద్రీకరించారు. బడ్జెట్‌లో కూడా సింహభాగం నిధులు వాటికే కేటాయించారు. సంక్షేమ క్యాలెండర్‌ అంటూ వివిధ పథకాలకు నిధులు ఎప్పుడు విడుదల అవుతాయో తేదీలతో సహా ముందే ప్రకటిస్తున్నారు. సరిగ్గా ఆ సమయానికే బటన్‌ నొక్కి మరీ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నారు. అమ్మవొడి, ఆసరా, వాహనమిత్ర, నేతన్న నేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా ఇలా అన్ని సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల జనానికి ఏదో ఒక రకమైన ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఎన్నికల సమయంలో ఒకట్రెండు హామీలు ఇవ్వడం, వాటికి ప్రచారం కల్పించడం మాత్రమే మనకు తెలిసిన గతం.

ఆంధ్రప్రదేశ్‌లో పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, వాటి ద్వారా పాపులర్‌ కావడం అనేది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు దగ్గర్నుంచి ప్రారంభమైంది. ఆయన ప్రకటించిన రెండ్రూపాయలకు కిలో బియ్యం తెలుగుదేశానికి అధికార పీఠాన్ని అప్పగించింది. 1994 ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం ఎన్టీయార్‌కి భారీ విజయాన్ని అందించింది. చంద్రబాబు తన హయాంలో సంక్షేమ కార్యక్రమాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆయన రాజకీయమంతా అభివృద్ధి చుట్టూ కొనసాగింది. ఎన్నికల ముందు పొత్తులతో అధికారం సాధించడం ఆయన స్పెషల్‌. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌, అవ్వాతాతలకు నెలకు రెండు వందల రూపాయల పెన్షన్‌ అంటూ జనాభిమానాన్ని సంపాదించారు. అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు సైతం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం పథకాల ద్వారా జనాలకు చేరువ అయ్యారు.

జగన్‌కు ముందు పనిచేసిన ముఖ్యమంత్రులంతా ఒకట్రెండు హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చేవారు. కానీ భారీ ఎత్తున నగదు బదిలీ పథకాలు ప్రకటించి, వాటిని తుచ తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మన దేశంలో బహుశా జగన్‌ ఒక్కరే అయి ఉండవచ్చు. ఇది ఆయనపై ప్రజల్లో విశ్వసనీయతను పెంచుతోంది. జగన్‌ ఉన్నన్నాళ్టూ ఈ పథకాలు ఖచ్చితంగా అమలు అవుతాయని జనం నమ్ముతున్నారు. రాబోయే కాలంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా, తన మ్యానిఫెస్టోకి కట్టుబడి ఉండి, సంక్షేమ పథకాలు అమలు చేసి తీరాల్సిన పరిస్థితిని జగన్‌ కల్పించారు. ఈ విధంగా జగన్‌ గేమ్‌ ఛేంజర్‌. అందుకే ఇప్పటివరకూ వెల్లడైన అన్ని సర్వేల్లో వైకాపా హవా స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు తిరుగులేదనే ప్రజాభిప్రాయాన్ని సర్వేలు ప్రతిబింబిస్తున్నాయి.

అయితే పాలనంతా సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి పెడితే, అభివృద్ధి మాటేమిటి? అభివృద్ధి జరిగితేనే ఆదాయం వస్తుంది. ఆదాయం ఉంటేనే సంక్షేమం సాధ్యమవుతుంది. సంపాదన లేని ఖర్చు కుటుంబాన్నయినా, రాష్ట్రాన్నయినా అప్పుల పాలుచేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అనుత్పాదక వ్యయమే ఎక్కువ. అంటే జనం దగ్గరకు డబ్బులు వెళ్తున్నాయి కానీ, రాష్ట్రానికి ఆదాయం పెరగడం లేదు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భవిష్యత్తులో పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విషయంపై జగన్‌ దృష్టి పెట్టి, రాష్ట్రంలో పెట్టుబడులు పెంచి, ఆదాయ మార్గాలు పెంచకపోతే జగన్‌ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టినవారవుతారు. భవిష్యత్తు తరాల ముందు ఆయన దోషిగా నిలబడతారు.

Tags:    

Similar News