కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ హెచ్చరిక

ఆలేరు నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలు ఉండగా.. 7 మండలాలకు అధ్యక్షులను నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి ..

Update: 2023-07-15 10:05 GMT

కాంగ్రెస్ కార్యకర్తలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇకపై గాంధీ భవన్ లో ఆందోళనలు చేస్తే.. వారిపై చర్యలు తప్పవని పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. కొద్దిరోజులుగా పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతుందంటూ.. కాంగ్రెస్ లో కొందరు నాయకులు గాంధీ భవన్ లో ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం కూడా రేవంత్ గాంధీ భవన్ కు వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. ఆ ఆందోళనల గురించి వివరాలు తెలుసుకున్న రేవంత్.. వారిపై తీవ్రంగా స్పందించారు.

ఆలేరు నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలు ఉండగా.. 7 మండలాలకు అధ్యక్షులను నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారినే నియమించామని, ఒకే ఒక్క మండలానికి మహిళను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ ఆందోళనలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఆందోళన విరమించకపోతే వారందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అందుకు వారి వివరాలను సేకరించాలని గాంధీభవన్ ఇన్ ఛార్జ్, పీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్ రావును ఆదేశించారు. అలాగే మండల కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్న శంకర్ నాయక్ ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇకపై ఎవరైనా గాంధీ భవన్ మెట్లపై ధర్నాలు చేస్తే.. వారిని నిర్మొహమాటంగా సస్పెండ్ చేస్తామని రేవంత్ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని హెచ్చరించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికి సూచించారు. ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా పార్టీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వేమ నరేందర్ రెడ్డి లకు వినతిపత్రాలను అందజేయాలని, వాటిని పార్టీ పరిశీలించి, చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందన్నారు.


Tags:    

Similar News