Weather Report : రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు...మండుటెండల్లో ఉపశమనం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చల్లని వాతావరణం ఏర్పడింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చల్లని వాతావరణం ఏర్పడింది. మండే ఎండల్లో కొంత ప్రజలకు ఉపశమనం లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల చిరు జల్లులు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ అకాల వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. మిగిలిన చోట్ల పొడి వాతావరణం నెలకొని ఉంటుందని చెప్పింది.
నిన్నటి నుంచే వానలు
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే నిన్నటి నుంచి కొన్ని చోట్ల వానలు పడుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం ఉక్కపోత వాతావరణం నెలకొన్నా మిగిలిన ప్రాంతాల్లో కొంత చల్లని వాతావరణం నెలకొని ఉంది. అనంతపురంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో కొంత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల చిరు జిల్లులు కురిశాయి. రానున్న మూడు రోజుల్లో కొన్ని చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
తెలంగాణలో మారిన వాతావరణం...
తెలంగాణలోనూ వాతావరణం మారింది. అల్పపీడన ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. తెలంంగాణలోని 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడిచింది. రాబోయే మూడు రోజులు వానలు పడతాయని చెప్పింది. ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవాలని కోరింది.