KCR : బాస్ బిగ్ కమ్ బ్యాక్... ఇక ప్రత్యర్థులకు జజ్జనకరి జనారేనట

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు. ఇందుకు రేపు ముహూర్తం కానుంది

Update: 2025-02-18 12:25 GMT

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు. ఇందుకు రేపు ముహూర్తం కానుంది. వేదిక తెలంగాణ భవన్ కాబోతుంది. ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తుండటంతో గులాబీ దళంలో జోష్ నింపడం ఖాయంగా కనిపిస్తుంది. 19వ తేదీన తెలంగాణ భవన్ లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు, జిల్లా అధ్యక్షులతో పాటు పార్టీ నేతలందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. నియోజకవర్గాల ఇన్ ఛార్జులు కూడా హాజరు కానున్నారు.

సిల్వర్ జూబ్లీ వేడుకలకు...
బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకుంటుంది. ఇందుకోసం ఈ సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఇప్పటి వరకూ యర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఆయన ఎన్నికలలో ఓటమి తర్వాత రెండు సార్లు మాత్రమే తెలంగాణ భవన్ కు వచ్చారు. నేతలతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి నెలలో ఒకసారి వచ్చారు. జులైలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరొకసారి వచ్చారు. ఇక ఆరు నెలల నుంచి ఆయన హైదరాబాద్ కు కూడా రావడం మానేశారు. ఫామ్ హౌస్ లోనే ఉండి వ్యవసాయ పనులను చూసుకుంటున్నారు. ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే అక్కడకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
రిజల్ట్ తర్వాత...
పార్లమెంటు ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన కేసీఆర్ రిజల్ట్ తర్వాత పూర్తిగా కనుమరుగై పోయారు. అంతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు, కూతురు కవితలు మాత్రమే పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అయితే కేసీఆర్ వస్తేనే నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ జోష్ మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటి వరకూ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా తర్వాత ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి కొంత ఆపగలిగారు. ఈ రకంగా ఇకపై ఎవరూ వెళ్లకుండా నిరోధించిన కేసీఆర్ ఇకపై జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని గులాబీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నేతలకు దిశానిర్దేశం...
రేపు జరగనున్న కీలక సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఏ విధంగా వచ్చింది? ఏ హామీలు ఇచ్చి ప్రజలను ఇప్పటి వరకూ మోసం చేసింది. రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి పథకాలపై అనర్హుల పేరిట ఏరివేసేకార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు రైతుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ నీటి వాటాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, చేస్తున్న అప్పులు తదితర అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులను కేసీఆర్ సమాయత్తం చేయనున్నారు. తాను కూడా తరచూ జిల్లాల పర్యటనలు చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాటుపడతానని చెప్పనున్నారు. దీంతో బాస్ కమ్ బ్యాక్ అంటూ గులాబీ పార్టీ క్యాడర్ నినదించే రేపటి రోజు అతి కీలకమైనదిగా చెబుతున్నార.


Tags:    

Similar News