తెలంగాణపై కాంగ్రెస్‌ ఫోకస్‌.. స్పీడు పెంచిన పార్టీ

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో హడావుడి ఎక్కువైపోయింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ స్పీడు ..

Update: 2023-09-03 10:42 GMT

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో హడావుడి ఎక్కువైపోయింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ స్పీడు పెంచింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం గాంధీభవన్ వేదికగా జరగనుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై చర్చించనుంది. ఇప్పటికే ఆశావహుల నుంచి అర్జీలు స్వీకరించిన పీసీసీ.. వాటిని పరిశీలించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 1006 దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తుల్లోను పార్టీ పరిశీలిస్తోంది. ఎవరికి టికెట్‌ ఇవ్వాలన్నదానిపై చర్చ కొనసాగుతోంది. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు వచ్చిన 1006 దరఖాస్తులపై చర్చ కొనసాగుతోంది. కొందరికి ఇప్పటికే ఫైనల్‌ చేసినట్లు సమాచారం.

అయితే ఈ జాబితాలో ముందుగా నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను వేర్వేరు చేస్తోంది. ఆ తర్వాతే రిజర్వేషన్‌ల కేటగిరీ నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫైనల్‌ చేయనున్నారు. అలాగే బీసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను కూడా నియోజకవర్గాల వారీగా వేరు చేసి కమిటీ క్షణ్ణంగా పరిశీలిస్తోంది.

ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విధివిధానాలను ఎలక్షన్ కమిటీ సమావేశంలో సభ్యులంతా చర్చించనున్నారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిటీ మరోసారి సమావేశమై జాబితాను షార్ట్ లిస్టు చేయనుంది. అనంతరం ఈ లిస్టును స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది. ఎలక్షన్ కమిటీ నుంచి ఎంపిక చేసిన జాబితాపై పార్టీ సర్వే కూడా పూర్తి చేసి.. స్క్రీనింగ్ కమిటీకి అందజేయనున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్‌ మూడో వారంలో 30 మంది అభ్యర్థుల జాబితా?

ఇక కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని రాష్ట్రంపై ఫోకస్‌ పెట్టింది. ఈ నెల మూడో వారంలో కనీసం 30 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News