South Central Railway : దక్షిణాదిన ఆలయాలను చుట్టి వచ్చే రైలు రెడీ.. ఎప్పటి నుంచి అంటే?
దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక రైలును నడపనుంది.
దక్షిణాదిన పుణ్య క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే దక్షిణాదిన ఉండే అనేక పుణ్య క్షేత్రాలకు నిత్యం దేశం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి వెళుతుంటారు. అయితే దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక రైలును నడపనుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపనుంది. ఈ నెల 23వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే గభారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు దక్షిణాదిన ఉన్న అనేక ఆలయాలను చుట్టివస్తుంది.
ఎనిమిది రోజులు...
ఈ ప్రత్యేక రైలు అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చిలోని రంగనాధస్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయాలను దర్శించుకునే వీలుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు & రేణిగుంట వంటి ముఖ్యమైన స్టేషన్లలో మార్గ మధ్యంలో ఇరువైపులా ప్రయాణికుల కోసం రైలు ఎక్కేందుకు వీలుంది. ఈ యాత్ర మొత్తం ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల వ్యవధిలో సాగుతుంది. ఇందులో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు మరియు రోడ్డు రవాణాతో సహా), వసతి సౌకర్యం, బోజన వసతిని కూడా కల్పిస్తారు.
రైలు పర్యటన షెడ్యూల్
తిరువణ్ణామలై - అరుణాచలం ఆలయం
రామేశ్వరం - రామనాథస్వామి ఆలయం
మధురై - మీనాక్షి అమ్మన్ ఆలయం
కన్యాకుమారి - రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయం
త్రివేండ్రం - శ్రీ పద్మనాభస్వామి ఆలయం
తిరుచ్చి - శ్రీ రంగనాథస్వామి ఆలయం
తంజావూరు - బృహదీశ్వర ఆలయం
టూర్ ధర ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ లో పథ్నాలుగువేలు, థర్డ్ ఏసీ టిక్కెట్ ధర 22,500 రూపాయలు, సెకండ్ ఏసీ టిక్కెట్ ధర 29,500 రూపాయలుగా నిర్ణయించారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి ఈ రైలులో దక్షిణ భారతంలోని ఆలయాలను దర్శించుకునేందుకు టిక్కెట్లను బుక్ చేసుకోవాలంటే 9701360701, 9281030726, 9281030740, 9281495845 నంబర్లలో సంప్రదించవచ్చు.