Train : ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు.. ఇక సీట్ల సమస్య ఉండదేమో?
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నారు
రైలు ప్రయాణమంటే అందరూ ఇష్టపడతారు. తక్కువ ఖర్చుతో సుఖవంతమైన ప్రయాణాన్ని కోరుకుంటారు. సురక్షితమైన ప్రయాణానికి రైలు ప్రయాణమే బెటర్ అని భావిస్తారు. అందుకే మన దేశంలో ఎన్ని రైళ్లు వేసినా ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడిపోతుంటాయి. తక్కువ ఖర్చుతో గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకునే అవకాశముండటంతో ఎక్కువ మంది రైళ్లలోనే ప్రయాణించడానికి ఇష్టపడుతుంటారు. దీంతో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. రెండు జనరల్ కోచ్ లు ఉన్న ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఇక నాలుగు జనరల్ బోగీలను ఏర్పాటు చేయనున్నారు.
పేద ప్రయాణికులకు అండగా...
దీంతో సీట్ల సంఖ్య పెరుగుతుంది. ప్రయాణికులు తొక్కిసలాట జరగకుండా కూర్చుని ప్రయాణం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దశలవారీగా 21 రైళ్లలో ఎనభై జనరల్ కోచ్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. జనరల్ బోగీల్లో సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకూ ఒక్కొక్క జనరల్ బోగీలో 90 సీట్లు మాత్రమే ఉండేవి. ఇకపై మరో పది అదనంగా చేర్చారు. అంటే ప్రయాణికులకు మరో పది సీట్లు అదనంగా ఒక్కొక్కొ జనరల్ బోగీకి అందుబాటులోకి వస్తాయి. సాధారణంగా జనరల్ బోగీలో ప్రయాణించే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి పేద ప్రయాణికుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పటికే గౌతమి, నారాయణాద్రి, దక్షిణ్ వంటి రైళ్లలో అదనంగా జనరల్ బోగీలను ఏర్పాటు చేశారు.