Jublee Hills by Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊరిస్తుందిగా... చివరకు టిక్కెట్ దక్కేది వారికేనా?
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఆశావహులు పోటీ పడుతున్నారు
సాధారణంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు మీరరు. అధినాయకత్వం ఆలోచనలే ఆయన బయటకు చెబుతారు. అటువంటిది తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో కలవరానికి గురి చేస్తున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే త్వరలో జరిగే ఈ ఉప ఎన్నికల్లో పోటీకి చాలా మంది సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికలో గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందన్న భావన ఎక్కువగా కలగడంతో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపు ఖాయమని భావించి పోటీకి సిద్ధమవుతున్నారు.
అజారుద్దీన్ ప్రయత్నాలు...
గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేశారు. ఆయన మాగంటి గోపీనాధ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఉప ఎన్నికలో ఎంఐఎం పోటీ చేస్తుందా? లేదా? అన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో గెలుపు గ్యారంటీ అని హస్తం పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే బయట నియోజకవర్గాల నుంచి వచ్చి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ తాను పోటీ చేస్తానని గాంధీ భవన్ లో చెప్పడంతో ఆయనకు పార్టీ నాయకత్వం క్లాస్ పీకింది. అజారుద్దీన్ హస్తిన స్థాయిలో తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు కావడంతో ఆయనకు అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు.
సీనియర్ నేతలు కూడా...
మరొక వైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ తో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రి ఒకరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అధిష్టానానికి వినతులను కూడా సమర్పించి వచ్చారు. గత ఎన్నికలలో పోటీ చేసి ఇతర నియోజకవర్గాల్లో ఓటమి పాలయిన వారు కూడా తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో టిక్కెట్ ను కాంగ్రెస్ అధినాయకత్వమే కేటాయిస్తుందని, అయితే స్థానికంగా ఉన్న వారికి మాత్రమే అభ్యర్థిగా ఎంపిక చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్థానికంగా ఉంటూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నేతలకు మాత్రమే టిక్కెట్ ఇస్తారన్నారు. బయట నియోజకవర్గం నుంచి వచ్చే వారికి మాత్రం అవకాశం ఉండదని చెప్పడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మరి చివరకు పార్టీ నాయకత్వం ఎవరి పేరు ఖరారు చేస్తుందన్నది చూడాలి.