మేడ్చల్ సరోగసి కేసులో తవ్వేకొద్దీ బయటపడుతున్న సంచనాలు
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో అమాయకులను మోసం చేసిన డాక్టర్ నమ్రతను మర్చిపోకముందే మేడ్చల్ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో అమాయకులను మోసం చేసిన డాక్టర్ నమ్రతను మర్చిపోకముందే మేడ్చల్ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడయితే వైద్యులు సరోగసి మహిళలతో బాండ్లు రాయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. తనిఖీల్లో భారీగా ప్రామిసరీ నోట్లు, బాండ్లు బయటపడ్డాయి. పెద్ద ఎత్తున హార్మోన్ ఇంజెక్షన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో మేడ్చల్ ఫెర్టిలిటీ సెంటర్ లో లోతుగా అధ్యయనం చేస్తే ఇంకెన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నది చూడాలి.
సెంటర్ కు వెళ్లిన వివరాలు...
ఇక మేడ్చల్ ఐవీఎఫ్ సెంటర్‌కు వెళ్లిన దంపతుల వివరాలను కూడా నిందితురాలు లక్ష్మి ఏజెంట్ల ద్వారా సేకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.లక్ష్మి నివాసంలో హెగ్డే హాస్పిటల్‌తో పాటు పలు ఫెర్టిలిటీ సెంటర్ల రిపోర్టులను కూడా పోలీసులు గుర్తించారు. ఐవీఎఫ్ సెంటర్లతో లక్ష్మికి ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీశారు. మహిళలను ప్రలోభపెట్టి సరోగసికి లక్ష్మి ఒప్పిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయిందని తెలిపారు. ఒక్కొక్కరి నుంచి నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ బేరం కుదుర్చుకున్నట్లు కూడా కనుగొన్నారు.
దంపతుల నుంచి...
సరోగసి కోసం వచ్చిన దంపతుల దగ్గర దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకూ లక్ష్మి వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. పిల్లల విక్రయాల కేసులో గతంలోను ముంబయి పోలీసులు లక్ష్మిని అరెస్ట్ చేశారు. ఎనిమిది మంది మహిళలకు ఇప్పటికే పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపగా వీరికి సహకరించిన వారి కోసం కూడా పోలీసులు తర్వాత అడుగులు వేస్తున్నారు. తవ్వేకొద్ది మేడ్చల్ సరోగసి కేసులో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి.