Telangana : అమిత్ షా తో రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజిపి బి. సుమతి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కేంద్రమంత్రికి వివరించారు. ముఖ్యంగా ఈగల్ ఫోర్స్ కార్యకలాపాలు, సైబర్ నేరాలను, సైబర్ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషిస్తున్న క్రియాశీలక పాత్రను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ మధ్య హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరణ చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమీషనరేట్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి కి వివరించారు. ఈ కారణంగా తెలంగాణకు ఇంకా ఎక్కువ ఐపీఎస్ అధికారుల అవసరాన్ని వివరించి తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచవలసిన అవసరాన్ని తెలిపారు. అంతేకాకుండా శరవేగంగా పెరుగుతున్న హైదరాబాద్ జనాభా దృష్ట్యా, పరిపాలన సౌలభ్యం కొరకు తెలంగాణకు అదనంగా ఐపిఎస్ అధికారుల కేటాయింపు అత్యవసరమని, ఈ దిశగా కేంద్ర హోం శాఖ సానుకూల నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.