Telangana : తెలంగాణలో రికార్డుస్థాయికి చేరుకున్న విద్యుత్తు వినియోగం...ఎంతంటే?
తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది
తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గతంలో నమోదు చేసిన రికార్డులను మించిన స్థాయికి చేరడం గమనార్హం. 18,139 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగిందని విద్యుత్తు శాఖ అధికారులు తెలపిారు. మార్చినెలలో ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో పాటు వేడి గాలులు పెరగడం కూడా విద్యుత్తు వినియోగం పెరగడానికి కారణమని అంటున్నారు. దీంతో పాటు సాగు నీటి అవసరాల కోసం, పరిశ్రమలకు, గృహ వినియోగం కలిపి విద్యుత్తు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. రానున్న కాలంలో విద్యుత్తు వినియోగం మరింత పెరుగుతుందని విద్యుత్తు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నెల మొదటి వారంలోనే...
మార్చి నెల మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగడంతో పాటు ఉక్కపోతతో ఫ్యాన్లు, ఏసీల వినియోగం కూడా పెరిగింది. దీంతో తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని విద్యుత్ శాఖ తెలిపింది. అత్యధిక వినియోగం గల రోజుగా మంగళవారం నమోదు అయిందని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 18,139 మెగావాట్లకు చేరిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు, అయితే ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో డిమాండ్‌ను తీరుస్తూ విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగుతోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన విద్యుత్ అందించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని మల్లు భట్టి విక్రమార్క కూడా చెప్పారు. విద్యుత్తు అంతరాయం లేకుండా సరఫరా ఉంటుందని మల్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.
ప్రధాన కారణాలివే...
విద్యుత్ వినియోగం పెరగడానికి ప్రధాన కారణం సేద్యం కోసం అవసరాలు కూడా పెరిగాయని తెలిపారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందని, అనేక పంటలను సాగుచేస్తున్న నేపథ్యంలో వాటికి అవసరమైన నీటి సరఫరాకు విద్యుత్తును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక తెలంగాణలో పరిశ్రమలు కూడా అత్యధికంగా ఉన్నాయి. ప్రధానంగా పరిశ్రమలు విద్యుత్తు పై ఆధారపడి మాత్రమే నడుస్తాయి.పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్తు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు పరిశ్రమలకు నిరంతరాయంగా సీజన్ తో సంబంధం లేకుండా విద్యుత్తు సరఫరా జరుగుతుంది. 2023-24లో తెలంగాణ విద్యుత్ వినియోగం 15,623 మెగావాట్లు ఉండగా, ఇప్పుడు 18,139 మెగావాట్లకు చేరింది. రానున్న కాలంలో విద్యుత్తు వినియోగం మరింత పెరుగుతుందని, అందుకు అనుగుణంగా విద్యుత్తును సరఫరా చేయాలని మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.