Telangana : మహిళలకు గుడ్ న్యూస్... వారి ఖాతాల్లో నెలకు రూ.2500లు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ఎన్నిలకు సిద్ధమవుతున్నారని తెలిసింది

Update: 2026-03-04 04:34 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ఎన్నిలకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ప్రజల మద్దతుతో మరోసారి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తెచ్చేందుకు అవసరమైన చర్యలు మూడేళ్ల ముందు నుంచే ప్రారంభించాలని నిర్ణయించినట్లు కనపడుతుంది. ప్రధానమైన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అంతే తప్ప ఇప్పట్లో ఇక ఎన్నికలు ఉండవు. ఒకవేళ వస్తే గిస్తే ఒకటి, రెండు ఉప ఎన్నికలు స్పీకర్ అనర్హత పిటీషన్ పై తీర్పు చెబితే వచ్చే ఛాన్స్ ఉంది. అంతే తప్ప మిగిలిన అన్ని ఎన్నికలు దాదాపు పూర్తయ్యాయి.

జమిలి ఎన్నికలకు వస్తాయని...
రేవంత్ రెడ్డి ఈసారి జమిలి ఎన్నికలు వస్తాయన్న ధీమాలో ఉన్నారు. 2029లోనే ఒకే సారి దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయని ఆయన పదే పదే చెబుతున్నారు. ఆయన లెక్క ప్రకారం జరిగినా 2029 సంవత్సరానికి గాను తెలంగాణాలో ఎన్నికలు జరిగే అవకాశముండదు. అంటే సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని ఆయన లెక్క. అయినా సరే ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. ప్రధానంగా మహిళా ఓటు బ్యాంకుపై ఆయన కన్నేసినట్లు కనపడుతుంది. మహిళలు అత్యధికంగా వెన్నుదన్నుగా నిలిస్తే తప్ప అధికారంలోకి రావడం ఎక్కడైనా సాధ్యం కాదు. అందుకే మహాలక్ష్మి పథకం కింద ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
నెలకు 2,500 రూపాయలు...
అందులో ప్రధానమైనది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అమలు చేయడం లేదన్న అసంతృప్తితో ఉన్నారని గుర్తించిన రేవంత్ రెడ్డి త్వరలోనే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.అయితే ఈ పధకం కింద అర్హులెంత మంది? అన్న దానిపై లెక్క తేల్చాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. విధివిధానాలు కూడా నిర్ణయించాలని కోరినట్లు తెలిసింది. తెలుపు రంగు కార్డు ఉన్న నిరుపేద మహిళలకు మాత్రమే ఈ పథకం కింద అర్హులుగా ఉండనున్నారు. ఇప్పటి వరకూ నిధులు కొరత కారణంగానే అమలు చేయలేకపోయామని, ఎన్నికలతో సంబంధం లేకుండా అమలు చేయడానికి ఈ ఏడాది ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి ఇటీవల మంత్రుల సమావేశంలో అన్నట్లు సమాచారం.




Tags:    

Similar News