Summer Effect : ఏసీలు ఆన్.. వేడి గాలులు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి మొదటి వారంలోనే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో పాటు ఎండ వేడిమిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తే మార్చి నెలలోనే ఇలా ఉంటే ఏప్రిల్ నెలలో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వారి అంచనాలకు అనుగుణంగానే ఇప్పుడు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక వేడిగాలుల ఉక్కపోత కూడా ప్రారంభం కావడంతో ఏసీలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్ అయ్యాయి.
ఏపీలో పగటి వేళ...
ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి తో పాటు నంద్యాల, ప్రకాశం, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఉదయం వేళ పొగమంచు కురుస్తుంది. పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనేక చోట్ల వాతావరణం గరిష్టంగా ఉంటుందని, ప్రజలు పగటి వేళల్లో బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
వేడి గాలులు మొదలు...
తెలంగాణ రాష్ట్రంలోనూ భానుడి భగభగలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే 34 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోత మొదలయింది. వేడిగాలులు ప్రారంభమయ్యాయి. నేడు కూడా తెలంగాణలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణ కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని కూడా అధికారులు తెలిపారు. అంటే ఈ వారంలోనే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకునే అవకాశముందని కూడా తెలిపింది. ఇక శరీరం డీహైడ్రేషన్ కు లోను కాకుండా మంచినీటిని ఎక్కువగా తీసుకోవాలని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.