Telangana : రేవంత్ హస్తిన పర్యటన వెనక అదే బలమైన కారణమా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది.

Update: 2025-12-15 12:33 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయింది. ఇప్పటి వరకూ రెండుసార్లు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఇంకా రెండు మంత్రి పదవులు రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఖాళీగా ఉన్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు మహ్మద్ అజారుద్దీన్ ను ఒక్కరే మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. మరో రెండు పదవులు రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. దీంతో మంత్రి వర్గ విస్తరణ జరపాలని పార్టీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. మరో మూడేళ్లు మాత్రమే సమయం ఉండటంతో మంత్రివర్గ విస్తరణ చేయకుండా నాన్చడం భావ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత రెండు, మూడు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉండి పార్టీ పెద్దలను కలసి మంత్రి వర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం.

ముఖ్య నేతల అభిప్రాయం మేరకు...
అయితే మంత్రి వర్గ విస్తరణ చేయాలంటే ముందుగా మంత్రివర్గంలోనూ కొంత ప్రక్షాళన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలియవచ్చింది. కొందరికి రెండేళ్లపాటు మంత్రిపదవిగా అవకాశమిచ్చినందున మరికొందరికి అవకాశం ఇవ్వాలంటే మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కొందరిని మంత్రి వర్గం నుంచి తప్పించి మరికొందరికి సామాజికవర్గం, ప్రాంతాలకు తగినట్లుగా మంత్రి వర్గం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. హైకమాండ్ మాత్రం ఇందుకు అంగీకరించిందా? లేదా? అన్నది తెలియక రాకపోయినా పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపడితేనే రానున్న ఎన్నికలకు తన టీం ను సిద్ధం చేసుకోవాలన్నది రేవంత్ ఆలోచనగా ఉంది.
ప్రక్షాళన చేసిన తర్వాత...
ఉన్న మంత్రివర్గంలో సభ్యులను అలాగే ఉంచి కేవలం ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసినట్లయితే ఆశావహుల్లో మరింత నిరాశ ఎదురవుతుందని రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల అభిప్రాయంగా కూడా ఉంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవులు రెండింటితో పాటు మరో నలుగురిని అయినా తప్పించగలిగితే ఆరుగురికి కొత్త వారికి అవకాశం దక్కుతుందని, అప్పుడు ఎలాంటి అసంతృప్తులు ఉండవన్న అంచనాలో ఉన్నారు. కానీ హైకమాండ్ ఇంత వరకూ దీనిపై ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిసింది. కేసీ వేణుగోపాల్ తో చర్చించిన తర్వాత కూడా క్లారిటీ రానట్లే తెలిసింది. మరొకవైపు పంచాయతీ ఎన్నికల తర్వాత మాత్రం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం బలంగా వినిపిస్తుండటంతో ఆశావహులు ఢిల్లీ బాట పట్టే అవకాశముంది. మరి మూడో దశ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరగనున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ అనేది ఎప్పుడన్నది మాత్రం క్లారిటీ రాకపోవడానికి కారణం ఎవరు ఇన్.. ఎవరు అవుట్? అన్న దానిపై హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే.


Tags:    

Similar News