Revanth Reddy : తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సిద్ధం చేస్తున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపుతో వచ్చిన ఉత్సాహంతో మరో ఉప ఎన్నికతో పార్టీ గ్రాఫ్ ను మరింత పెంచాలన్న యోచనలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ లు పార్టీ పెద్దలను కలసి అనుమతి తీసుకునే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నికకు ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం.
అనర్హత వేటు కత్తి...
దానం నాగేందర్ పై ఇప్పటికే అనర్హత వేటు కత్తి వేలాడుతుంది. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. మొత్తం పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు చేరువైనా దానం నాగేందర్ ది మాత్రం ప్రత్యేక కేసుగా చూడాలి. ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. అందుకే ఆయనపై అనర్హత వేటు పడటం ఖాయమని దాదాపు తేలిపోయింది. దీంతో దానం నాగేందర్ కూడా ముందుగానే రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారు.
ఖైరతాబాద్ నుంచి...
అనుకోకుండా వచ్చిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన విజయం సాధించడంతో ఇక దానం నాగేందర్ కూడా త్వరలోనే రాజీనామా చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. స్పీకర్ అనర్హత వేటు వేయకముందే ముందుగా తన పదవికి రాజీనామా చేయాలని, స్పీకర్ వెంటనే ఆమోదిస్తే మరో ఆరు నెలల్లో ఉప ఎన్నిక జరుగుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి. అందుకే పార్టీ ఢిల్లీ నాయకత్వం సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ ఊపులోనే ఉప ఎన్నికలకు వెళ్లి ఖైరతాబాద్ ను కూడా ఉప ఎన్నికల్లో గెలుచుకుని తమకు తిరుగులేదని నిరూపించుకోవాలన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మరో రెండు మూడు రోజుల్లోనే తెలియనుందని సమాచారం.