Medaram : మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభం
ములుగు జిల్లాలో మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది.
ములుగు జిల్లాలో మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక సమాగమాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ద్వైవార్షిక మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. జనవరి 28 సాయంత్రం 6 గంటలకు మహాజాతర ప్రారంభమవుతుంది. గిరిజన పూజారులు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. జనవరి 29 సాయంత్రం 6 గంటలకు సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారని అధికారులు మంగళవారం తెలిపారు.
అభివృద్ధి పనులు చేపట్టి...
సుమారు ఆరు నెలల క్రితమే ప్రభుత్వం జాతర ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. జనవరి 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమ్మక్క–సారలమ్మ దేవాలయాల పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. గిరిజన దేవతలైన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల పునర్నిర్మాణానికి రూ.101 కోట్లు ఖర్చు చేశారు. భక్తుల సౌకర్యాల కోసం మరో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. జాతర నిర్వహణలో 21 ప్రభుత్వ శాఖలు పాల్గొంటున్నాయి. భక్తుల రాకపోకలు, మౌలిక సదుపాయాలు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవల బాధ్యతలను సుమారు 42 వేల మంది సిబ్బంది నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ 4 వేల బస్సులు నడుపుతుంది.
నాలుగు రోజులపాటు...
మేడారం జాతరలో ఐదు వేల మందికిపైగా వైద్య సిబ్బంది, ప్రభుత్వ అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. డిజిటల్ సౌకర్యాలుగా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌ఓఎస్ అలర్ట్ పంపే భద్రతా మాడ్యూల్, ఫిర్యాదుల నమోదు సదుపాయం యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ పర్యావరణహిత చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. గిరిజన దేవతలు తమ భక్తులను దర్శించేందుకు వస్తారని విశ్వసించే కాలంలో మేడారం లో జాతర జరుగుతుంది. ఎటూరు నాగారం అభయారణ్యంలో, దండకారణ్య అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయుల పాలనలో కరవు సమయంలో విధించిన పన్నులపై సమ్మక్క–సారలమ్మ తల్లి–కూతుళ్లు చేసిన తిరుగుబాటును ఈ జాతర స్మరించుకుంటుంది. రహదారులను కూడా పునర్మించారు.