Danam Nagender : దానం ఎగిరెగెరిపడుతున్నది అందుకేనా?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం చూస్తుంటే ఎటూ కాకుండా రాజకీయంగా ఇబ్బంది పడేటట్లే కనిపిస్తుంది

Update: 2025-01-23 12:34 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం చూస్తుంటే ఎటూ కాకుండా రాజకీయంగా ఇబ్బంది పడేటట్లే కనిపిస్తుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పట్టున్న నేతగా పేరున్న దానం నాగేందర్ ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కూల్చివేతలను ఆపేయాలనంటూ ఆయన హుకుం జారీ చేయడమంటే ఒకరకంగా ఆయన కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్నట్లేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానం నాగేందర్ అనేక పార్టీలు మారి ఉండవచ్చు. కానీ నగరంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. హైడ్రా కూల్చివేతలను కూడా ఆయన అడ్డుకున్నారు. హైడ్రాకు అసలు కూల్చివేసే హక్కు లేదని ఆయన ప్రశ్నిచడం కూడా పార్టీ అగ్రనాయకత్వాన్ని నిలదీయడమే అవుతుంది.

గతంలోనూ హైడ్రాపై...
గతంలోనూ హైడ్రా కమిషనర్ రంగనాధ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్ మరోసారి కూల్చివేతలను అడ్డుకోవడంతో హాట్ టాపిక్ గా మారారు. ఏదో తేడా కొడుతున్నట్లు కనిపిస్తుందని అందరూ భావిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ తిరిగి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ మూసీ నది ప్రక్షాళన జరగాలంటూనే అదే సమయంలో పేదల ఇళ్లను కూల్చితే తాను ఒప్పుకోనని తెగేసి చెబుతున్నారు. పేదలను ఆందోళనకు గురి చేయవద్దని, ముఖ్యమంత్రి దావోస్ నుంచి వచ్చే వరకూ ఆగాలని కూడా దానం నాగేందర్ అధికారులను హెచ్చరించారు. హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే స్థానికుడిగా తాను ఊరుకోబోనని కూడా వార్నింగ్ ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని థిక్కరించడమే అవుతుంది.
కాంగ్రెస్ లో చేరి...
బిఆర్ఎస్‌కి మూడోసారి అధికారం ద‌క్క‌క‌పోవ‌డంతో నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి తాను చెలామణి కావచ్చని భావించార. మంత్రి పదవి వస్తుందని భావించినా అది సాధ్యంకాలేదు. దీంతో నాగేందర్ ఫ్రస్టేషన్ కు గురవుతున్నారని చెబుతున్నారు. తనకు పార్టీ మారినందుకు మంత్రి పదవి దక్కకపోగా, తన నియోజకవర్గంలో కూల్చివేతలను కూడా కాపాడుకోలేని అసమర్ధ నేతగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని ఆయన అనుమానిస్తున్నారు. అందుకే దానంనాగేందర్ తిరగబడటానికే సిద్ధమయినట్లు కనిపిస్తుంది. హైద‌రాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా ద‌క్క‌క‌పోవ‌డంతో రేవంత్‌రెడ్డి కూడా నాగేంద‌ర్‌ని కాంగ్రెస్ లోకి తిరిగి చేర్చుకున్నారు. అంతే తప్ప మంత్రి పదవి ఇవ్వాలన్న గ్యారంటీ లేదన్న విషయాన్ని దానం గుర్తిస్తే మంచిదని సూచనలు కూడా వెలువడుతున్నాయి.
ఇమేజ్ పెంచుకునే ప్రయత్నమా?
సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలంటే త‌న‌కు క్యాబినెట్‌లో సీటివ్వాల్సిందే అని రేవంత్ నుంచి హామీ తీసుకునిమ‌రీ సికింద‌రాబాద్‌లో పోటీ చేసిన నాగేందర్ రేవంత్ మంత్రి ప‌ద‌విని మాత్రం ఇవ్వ‌కపోవడంతో కొంత అసంతృప్తితో ఉన్నట్లే కనపడుతుంది. దీంతోనే నాగేందర్ ప్రభుత్వంపై తిరగబడటానికి సిద్ధమయ్యారని, అందుకే ముఖ్యమంత్రి నిర్ణయాలను ప్రశ్నిస్తూ, అధికారులకు వార్నింగ్ ఇస్తూ జనంలో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టారంటున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో దానం నాగేందర్ వార్నింగ్ లను అధికారులు లెక్కచేయకపోవచ్చు. ఎందుకంటే వారికి సీఎం ఆదేశాలు మాత్రమే ఫైనల్. అందుకే ఇప్పుడు దానం నాగేందర్ కాంగ్రెస్ లో ఉండాలా? లేదా ప్రజల కోసం పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు నిర్ణయించుకుంటారా? అన్నది ఆయనే తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.


Tags:    

Similar News