Medaram : మేడారానికి పోటెత్తిన భక్తులు.. ట్రాఫిక్ సమస్య.. నిలిచిన వాహనాలు
మేడారంలో నేడు జాతర ఆఖరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
మేడారంలో నేడు జాతర ఆఖరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఈ నెల 28వ తేదీన ప్రారంభమయిన మేడారం జాతర నేటి వరకూ కొనసాగుతుంది. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ మేడారం జాతరకు కోట్లాది మంది భక్తులు వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. అందులో భాగంగా నేడు శనివారం కావడంతో ఇంకా అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని భావించి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. ఒకవైపు వీఐపీల తాకిడి, మరొకవైపు సామాన్య భక్తుల సందడితో మేడారం జనసంద్రంగా మారింది.
నేడు ఆఖరి రోజు కావడంతో...
అయితే నిన్నటి నుంచి మేడారంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దాదాపు పన్నెండు గంటలుగా వాహనాలు నిలిచిపోయాయి. సొంత వాహనాల్లో ఎక్కువ మంది భక్తులు మేడారానికి చేరుకోవడంతో మేడారం వెళ్లేందుకు కూడా కష్టంగా మారింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమైన ట్రాఫిక్ సమ్యలు నేటి ఉదయం వరకూ కొనసాగాయి. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ప్రధానంగా పసరా నుంచి నార్లాపూర్ మార్గంలో వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని అధికారులు తెలిపారకు.
బస్సుల కోసం...
ఇక మేడారంలో మొక్కులు తీర్చుకున్న భక్తులు తిరుగు ప్రయాణం కోసం భక్తుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. మేడారం జాతర అంటే మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తమ వాహనాల్లో తరలి వస్తారు. అయితే వారంతా తమ వాహనాలలోనే ఎక్కువగా తరలి రావడంతోనే ఈ సమస్య తలెత్తింది. మూడు కోట్ల మంది ఈ నాలుగు రోజుల పాటు వనదేవతలను సందర్శించుకుంటారని అంటున్నారు. పారిశుద్ధ్యం ఇబ్బంది లేకుండా, తాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మేడారం వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోవడంతో గంటల పాటు భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటున్నారు.