అమిత్ షా తో పవన్ కళ్యాణ్?

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు

Update: 2023-10-24 11:23 GMT

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ నెల 27న అమిత్ షాను కలవనున్నారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించనున్నారు. టీఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే పవన్ ను బీజేపీ కోరింది. అయితే తెలంగాణలో కొన్ని స్థానాల్లో పోటీ చేయాలనే పట్టుదలతో జనసేన ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పవన్ భేటీ కీలకం కాబోతోంది. పవన్ తో ఈ నెల 18న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 32కి పైగా స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే జాబితాను కూడా ఇప్పటికే జనసేన విడుదల చేసింది. జనసేన డిమాండ్లపై అమిత్ షా ఎలా స్పందిస్తారో చూడాలి.

అమిత్ షా అక్టోబర్ 27న తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో పర్యటించిన అమిత్ షా 27న మరోసారి రానున్నారు. సూర్యాపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. బీజేపీ ఇప్పటికే దాదాపు సగం సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో రెండో జాబితా రానుంది. మొదటి జాబితాలో తమ పేర్లు లేని కొంతమంది ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరితో అమిత్ షా భేటీ అవ్వనున్నారని తెలుస్తోంది. అసంతృప్తి నేతల భవిష్యత్తుకు అమిత్ షా భరోసా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News