Telangana : కళ్యాణమస్తు.. అస్తు.. మస్తు.. ఇక అంతేనా?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంత వరకూ కల్యాణ లక్ష్మి మాత్రం అమలు కాలేదు

Update: 2025-07-19 06:07 GMT

తెలంగాణలో కల్యాణలక్ష్మి పథకానికి ప్రభుత్వం అంపకాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంత వరకూ కల్యాణ లక్ష్మి మాత్రం అమలు కాలేదు. షాదీ ముబారక్ ను కూడా గ్రౌండ్ చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారంతో పాటు లక్ష రూపాయల నగదును ఇస్తామని ప్రకటించింది. ఇది తమ గ్యారంటీ అని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన హామీలు అమలు చేస్తున్నా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. దీనికి కారణం నిధుల కొరత అని చెప్పుకోవాల్సి ఉంటుంది.

పేరును మారుస్తూ...
అయితే కొన్ని రోజుల క్రితం మాత్రం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్యాణ లక్ష్మి పథకం పేరును కల్యాణమస్తుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు మార్పుపై స్పష్టత నిచ్చారు. కల్యాణ మస్తు పథకాన్ని త్వరలోనే అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏడాది క్రితం చెప్పారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. లక్ష రూపాయల నగదు ఇస్తామని చెప్పారు. తులం బంగారం గురించి కూడా నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించలేదు. కనీసం బడుగు, బలహీన , పేద వర్గాలకు కల్యాణమస్తు పథకం అమలు చేస్తారని అందరూ భావించారు.
పెళ్లిళ్ల సీజన్ వెళ్లిపోతున్నా...
వరసగా పెళ్లిళ్లు సీజన్లు పూర్తవుతున్నాయి. కానీ కల్యాణమస్తు పథకం మాత్రం ఇంత వరకూ అమలుకు నోచుకోలేదు. కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ జనాల్లోకి అందులోనూ మహిళల్లోకి బాగా ప్రాచుర్యం పొందింది. మహిళలకు బంగారం అంటే అత్యంత ఇష్టం కావడంతో వారి బలహీనతను చూసి హామీని ఇచ్చారని అప్పట్లో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పై విమర్శలు చేసింది. అయితేనేం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిరెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకూ కల్యాణమస్తు, షాదీముబారక్ పథకాలను మాత్రం కాంగ్రెస్ సర్కార్ అమలుకు పూనుకోలేదు.
బంగారం ధర పెరగడంతో...
మొన్నటి వరకూ పెళ్లిళ్లు జరిగాయి. మళ్లీ పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. జులై చివరి నుంచి నవంబరు నెల వరకూ మంచి ముహూర్తాలున్నాయి. దీంతో అనేక మంది ముహూర్తాలు పెట్టుకుని పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ఎన్ని జంటలు ఒక్కటవుతున్నా ఇచ్చిన ప్రామిస్ మాత్రం అమలు కావడం లేదు. తులం బంగారం ఇవ్వాలంటే ఇప్పుడు సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే పది గ్రాముల బంగారం ధర దాదాపు లక్ష రూపాయలకు చేరువలో ఉంది. అందుకే ప్రభుత్వం వెనకగడుగు వేస్తుందని అంటున్నారు. తులం బంగారం మాట దేముడెరుగు... కనీసం లక్ష రూపాయలైనా ఇచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న డిమాండ్ వినపడుతుంది. మరి రేవంత్ సర్కార్ ఈ పథకానికి ముహూర్తం మాత్రం నిర్ణయించలేదు..



Tags:    

Similar News