Supreme Court : నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2025-10-06 01:50 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఈరోజు ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది.

ఢిల్లీకి మంత్రులు
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు భేటీ అయి కీలక చర్చలు జరిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అయితే నేడు విచారించే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ లు ఢిల్లీకి చేరుకున్నారు. న్యాయనిపుణులతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేలా వాదనలు చేయాలని సూచిస్తున్నారు. కానీ న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందన్న దానిపైనే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు ఉండనుంది.


Tags:    

Similar News