Telangana : సర్పంచ్ ఎన్నికలకు ఇంత గిరాకా? ఎమ్మెల్యే పదవికి మించి హామీలిస్తున్నారుగా?
తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అనేక విశేషాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అనేక విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు డిమాండ్ పెరిగింది. తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ పంచాయతీకి కోటి రూపాయలను విరాళంగా ప్రకటిస్తానని కూడా చెబుతున్నారు. కొందరయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు మించి హామీలను కూడా సర్పంచ్ అభ్యర్థులు చేస్తున్నారు. తమన గెలిపిస్తే గ్రామాల్లో ఈ పనులు చేస్తామన్న హామీలతో ప్రజల ముందుకు వెళతున్నారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నిక 2025ల జాతర మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి తొలివిడత నుంచి మూడో విడత నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఎమ్మెల్యే కావడానికి, రాజకీయంగా ఎదగడానికి సర్పంచ్ తొలి అడుగు కావడంతో ఈ పదవికి డిమాండ్ పెరిగింది.
గ్రామాల్లో ఎన్నికల సందడి...
దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. సర్పంచ్ గా పోటీచేసే వాళ్లు తమ మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూఠాపురం గ్రామం నుంచి రావెళ్ల కృష్ణరావ్ అనే వ్యక్తి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. ఈయన ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనను గెలిపిస్తే ఎకరం భూమి, ఇంటిపన్ను, నీటిపన్ను చెల్లిస్తానంటూ వరాల జల్లులు కురించాడు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని వీరన్న స్వామి ఆలయం కోసం 1 ఎకరం భూమి విరాళం, అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు అందరి ఇంటి పన్ను చెల్లింపు, ఐదేళ్లు నేనే నల్లా బిల్లులు చెల్లింపు, గ్రామంలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఉచిత మందులు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చార.
ఒకే కుటుంబానికి చెందిన...
అలాగే గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయానికి ఉత్సవాల కోసం రూ.50,000 ఆర్థిక సాయం అందిస్తానని ఆయన ఇచ్చిన హామీల్లో తెలిపారు. వినాయక చవితి సందర్భంగా అన్ని ఉత్సవ కమిటీలకు విగ్రహాలు ఉచితంగా అందచేస్తానని చెప్పారు. మరొకవైపు ఇదే జిల్లాలోని జీడీ నగర్ గ్రామపంచాయతీ రిజర్వేషన్ మార్పుతో అక్కడి రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇంతకుముందు ఈ గ్రామం కన్నాల గ్రామపంచాయతీకి కింద ఉండేది. అప్పట్లో ఇది ఎస్సీ రిజర్వ్‌గా ఉండటంతో, స్థానిక నాయకుడు సమ్మయ్య భార్య సునీత సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. తరువాత జీడీ నగర్ ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడినప్పుడు, 2018 ఎన్నికల్లో సమ్మయ్య గెలిచి సర్పంచ్ అయ్యారు. ఇప్పుడు రిజర్వేషన్ బీసీ మహిళలకు మారడంతో అదే కుటుంబం నుంచి మరోసారి పోటీ రంగంలోకి దిగడం గ్రామస్థుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి జరిగే పోటీ ఏ దిశలో తిరుగుతుందన్న ఆసక్తి పెరిగింది.