Rain Alert : ఈరోజు కూడా వాన ముప్పు ఉందట.. జాగ్రత్తగా ఉండాల్సిందే

వాతావరణ శాఖ నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

Update: 2025-12-03 04:12 GMT

దిత్వా తుపాను వాయుగుండంగా మారినప్పటికీ ఆ ప్రభావంతో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు - పుదుచ్చేరి తీరాల వైపునకు కదులుతూ అల్పపీడనంగా బలహీన పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు ఈరోజు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అలెర్ట్ గా ఉండాలని సూచించింది. నదులు, వాగులు దాటే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు...
వాయుగుండం ప్రభావం కారణంగా ఈరోజు ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది. బలమైన ఈదురుగాలులు గంటకు ముప్ఫయి ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలో మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో చలిగాలులు...
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని మాత్రమే చెప్పింది. భారీ వర్షాలు పడే అవకాశం మాత్రం లేదని చెప్పింది. అయితే చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ఉదయం వేళ దట్టమైన పొగమంచు అలుముకునే అవకాశముంది. ఏజెన్సీ ప్రాంతంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ప్రజలు చలి నుంచి తట్టుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


Tags:    

Similar News