Telangana : మూడు నెలలకు ఒకసారి బియ్యం ఇస్తుండటంతో రేషన్ షాపుల వద్ద పెరిగిన రద్దీ
సన్నబియ్యానికి తెలంగాణలో డిమాండ్ పెరిగింది. తెలంగాణలో రేషన్ షాపుల ముందు ప్రజలు బియ్యం తీసుకోవడానికి పడిగాపులు కాస్తున్నారు
సన్నబియ్యానికి తెలంగాణలో డిమాండ్ పెరిగింది. తెలంగాణలో రేషన్ షాపుల ముందు ప్రజలు బియ్యం తీసుకోవడానికి పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడలేక సంచులు, చెప్పులు పెడుతున్నారు. ఒక వ్యక్తికి రేషన్ ఇచ్చేందుకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతుందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఉదయం ఆరు గంటల నుంచే క్యూలో నిల్చొని, సర్వర్ ప్రాబ్లం ఉండడంతో గంటల తరబడి క్యూ లైన్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఆలస్యమవుతుందని రేషన్ డీలర్ లను నిలదీయగా, సర్వర్ ప్రాబ్లం ఉందని సాంకేతిక నిపుణులు వచ్చి సరి చేసేవరకు ఏం చేయలేమని సమాధానం ఇస్తున్నారు.
ప్రజల్లో అసహనం...
కూలి పనులు, ఉద్యోగాలు మానుకొని లైన్ లో నిలుచుంటున్నామని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇచ్చేముందు సాంకేతిక లోపాలను సరిచేసుకోవడం తెలియదా అంటూ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రేషన్ ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో సన్న బియ్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది. రేషన్ దుకాణాల్లో తెలుపు రంగు రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో ప్రజలు హ్యాపీ ఫీలవుతున్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఇంతటి రష్ ఉండేది కాదని రేషన్ దుకాణాల డీలర్లు చెబుతున్నారు. చాలా వరకూ బియ్యాన్ని తీసుకునే వారు కాదని, కొందరు తీసుకున్న బియ్యాన్ని బయట వ్యాపారులకు విక్రయించే వారని చెబుతున్నారు.
సన్న బియ్యం కావడంతో...
సన్న బియ్యం కావడంతో అందులోనూ ఉచితంగా ఇవ్వడం, ఇంట్లో ఎంత మంది ఉన్నప్పటికీ ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తుండటంతో సన్న బియ్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది. తెలంగాణలో మొత్తం 90 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. అందులో మూడుకోట్ల మందికి సన్నబియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. ప్రతినెల రేషన్ దుకాణాలకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తుంది. ఎక్కడా బియ్యం కొరత అంటూ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డులు వస్తే మరో ముప్ఫయి లక్షల మంది లబ్దిదారులు పెరిగే అవకాశముంటున్నారు. ఈ సన్నబియ్యం పథకం కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 10,615 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.
ఒకేసారి బియ్యాన్ని తీసుకుని...
అందులో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలకోట్ల రూపాయలను ఖర్చుచేస్తుంది. అదనంగా ప్రభుత్వం పై మూడు కోట్ల రూపాయలు భారం పడినప్పటికీ గతంలో అరవై శాతం మంది మాత్రమే రేషన్ బియ్యం తీసుకునే వారని, ఇప్పుడు వందశాతం మంది తీసుకోవడం పథకం సూపర్ సక్సెస్ అయిందని చెప్పడానికి ఉదాహరణ అని ప్రభుత్వ వర్గాలు అందనున్నాయి. ఇదే సమయంలో మూడు నెలల పాటు భారీ వర్షాలు, వరదలు ఉంటాయని భావించి మూడు నెలలకు ఒకేసారి సన్న బియ్యం ఇస్తుండటంతో దీనికి డిమాండ్ ఏర్పడింది. అందుకే రేషన్ దుకాణాల వద్దకు క్యూ కడుతున్నారు. అనేక చోట్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో బియ్యం తీసుకునేందుకు ఎక్కువ సమయంపడుతుంది.