Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. రానున్న మూడు రోజుల పాటు

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు

Update: 2026-01-21 04:47 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. మరికొద్ది రోజుల పాటు చలితీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా ఇప్పటికీ కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రాను రాను ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి నెలంతా ఇలాంటి వాతావరణమే ఉంటుందని భావిస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.

ఏపీలో భిన్నమైన పరిస్థితులు...
ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం, రాత్రి వేళ కొంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఉదయం వేళ పొగమంచు కూడా అధికంగా ఉంటుంది. ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మరొకవైపు ఏజెన్సీ ఏరియాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు, అరకు, మినుములూరులో ఐదు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నేటికీ నమోదవుతున్నాయి. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో పొగమంచు...
ఇక తెలంగాణలోనూ క్రమంగా చలిగాలుల తీవ్రత తగ్గుతుంది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోనూ పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కాని ఉదయం తొమ్మిది గంటల వరకూ దట్టమైన పొగమంచు అలుముకుంటుందని తెలిపింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. విజిబులిటీ సక్రమంగా లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశముందని వెల్లడించింది. సొంత వాహనాల్లో ప్రయాణించే వారు ఉదయం తొమ్మిది గంటల తర్వాత మాత్రమే ప్రయాణాలు చేయాలని కోరారు.


Tags:    

Similar News