సశేషమే... సమాప్తం కాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయంలో విచారణ పూర్తయింది

Update: 2023-03-20 15:45 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయంలో విచారణ పూర్తయింది. ఈరోజు పది గంటలకు పైగా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక విషయాలపై ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే ఈడీ అధికారులు కవితను సాక్షిగానే విచారణకు పిలుస్తామని తెలియజేశారు. కొద్దిసేపటి క్రితం కవిత న్యాయవాదులు కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఉదయం పదిన్నర గంటలకు ఈడీ కార్యాలయంలోపలకి వెళ్లిన కవిత రాత్రి తొమ్మిదన్నర గంటలకు బయటకు వచ్చారు. ఆమె నేరుగా కవిత నివాసానికి చేరుకుంటున్నారు. 

పది గంటల పాటు...
ఈ నేపథ్యంలో కవితను సాక్షిగానే చూస్తారా? నిందితురాలిగా పరిగణిస్తారా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. తొలిసారి కవితను 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు రెండోసారి కూడా పది గంటలకు పైగానే విచారణ జరిపారు. అయితే కవిత గత విచారణలో సహకరించలేదని బీజేపీ నేతలు అనడంపై కూడా చర్చనీయాంశమైంది. రెండోసారి విచారణకు హాజరైన కవితకు ఈడీ అధికారులు ఏ ప్రశ్నలు సంధించారని ఆసక్తికరంగా మారింది. అయితే మరోసారి కవితను ఈడీ అధికారులు విచారణకు పిలిచినట్లు అనధికారికంగా సమాచారం అందుతుంది. రేపు మరోసారి విచారణకు హాజరు కావాలని కోరినట్లు చెబుతున్నారు. రేపు ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని కవితను ఈడీ అధికారులు కోరినట్లు తెలిసింది.


Tags:    

Similar News