Andhra Pradesh : చేరికలను వాయిదా వేసుకుంటున్న ఎమ్మెల్యేలు...భయపడిపోతున్నారా?

వైసీపీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరడానికి వెనుకంజ వేస్తున్నారు. టీడీపీలో చేరాలనుకున్న ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు

Update: 2024-01-24 05:22 GMT

వైసీపీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరడానికి వెనుకంజ వేస్తున్నారు. టీడీపీ, జనసేనలో చేరాలనుకుంటున్న ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. అందుకు కారణం అనర్హత వేటు పడుతుందని భయపడటమే. రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు టిక్కెట్ రాని ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు వేరే పార్టీలో చేరారు. మరికొందరు పార్టీలో చేరేందుకు ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు. ఈలోపు గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడంతో పాటు కొందరి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారంతో వెనక్కుతగ్గుతున్నారు.

పార్థసారధి చేరిక...
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి పార్టీకి రాజీనామా అధికారికంగా చేయలేదు కానీ, ఆయన ఎప్పటి నుంచో పార్టీకి దూరంగా ఉంటున్నారు. టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. వాస్తవానికి ఇప్పటికే పార్థసారధి టీడీపీలో చేరాల్సి ఉంది. ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీలో చేరితే రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేయకుండా అనర్హత వేటు పడుతుందని ఆయన భావించి చేరికను వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజ్యసభ ఎన్నికల తర్వాత చేరవచ్చని, అప్పటి వరకూ ఆగాలని పార్ధసారధికి సూచించనట్లు సమాచారం. అందుకే పార్థసారధి టీడీపీలో చేరిక వాయిదా పడిందని అంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు...
పార్థసారధితో పాటు తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వీరు కూడా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. టిక్కెట్ దక్కని మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ, జనసేనలో చేరాలని రెడీ అవుతున్న తరుణంలో అనర్హత వేటు పడుతుందని భావించి వెనక్కు తగ్గినట్లు ప్రచారం జరుగుతుంది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకూ చేరికను వాయిదా వేసుకుంటున్నారు. అందుకే ఇప్పట్లో జనసేన, టీడీపీల్లో వైసీపీ నేతల చేరికలు ఉండవని చెబుతున్నారు. అయినా వైసీపీ నాయకత్వం మాత్రం ఏదో సాకు చూపి వారిపై స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని చూస్తుంది. మొత్తం మీద పెద్దల సభ పదవుల గేమ్ లో ఎవరిది పై చేయి అవుతుందన్నది మాత్రం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News