Vidadala Rajini : ఎందుకు తల్లీ అంత ... మనమేందో మనకు తెలియాలి కదా?

మంత్రి విడదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు అక్కడి వైసీపీ నేతలు అంగీకరించడం లేదు

Update: 2023-12-17 08:30 GMT

vidadala rajini

రాజకీయాల్లో ఎంత కష్టపడినా ఎదగని వారు అనేక మంది ఉంటారు. ఐదారుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయినా మంత్రి కాలేదన్న బాధ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది రాజకీయనేతలకు ఉంది. అలాంటిది లక్కు కలసి వస్తే... తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన వాళ్లు కొందరే ఉన్నారు. వారిలో విడదల రజని ఒకరు. అతి తక్కువ కాలంలో రెండు పార్టీలు మార్చేసిన విడదల రజని చివరకు రెండు ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. తనపై ఇంత వ్యతిరేకత ఉండటానికి కారణాలేంటో రజనీ తెలుసుకుంటే అదే పదివేలు అని క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు.

సోషల్ మీడియాలో మాత్రం...
ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తాను ఎంతో ఎదిగిపోయాననుకునే మనస్తత్వం కొందరికి ఉంటుంది. అందులో ఫస్ట్ సారి మంత్రి పదవి వరిస్తే ఇంకేముంటుంది. తలపొగరు నెత్తికెక్కితే తనను గెలిపించిన వాళ్లనూ మర్చిపోతారు. తనవల్లనే విజయం సాధ్యమవుతుందని భ్రమిస్తారు కొందరు. అలాంటి భ్రమలోనే విడదల రజని ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియలో తాను యాక్టివ్ గా ఉంటే చాలునని విడుదల రజనీ విశ్వసించారులా ఉంది. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడుదల రజనీని ఈసారి వైసీపీ అధినాయకత్వం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపింది. అందుకు కారణం చిలకలూరిపేటలో ఆమె వ్యతిరేక గ్రూపు ఎక్కువగా ఉండటం, అసంతృప్తులు పెరగడంతో ఆమెను నియోజకవర్గాన్ని మార్చాల్సి వచ్చింది.
అతి తక్కువ కాలంలో...
విడదల రజనీ 2014 లో రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా టీడీపీలో చేరారు. చిలకలూరిపేటలో వీఆర్ ఫౌండేషన్‌ను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు చేరువయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఆశించినా దక్కకపోవడంతో వెంటనే వైసీపీ లోకి జంప్ చేశారు. అయితే బీసీ కార్డు ఆమెను వైసీపీకి దగ్గరగా చేర్చింది. నిజంగా విడదల రజనీకి చిలకలూరిపేట టిక్కెట్ ఇచ్చి వైసీపీ అధినేత జగన్ పెద్ద ప్రయోగమే చేశారని అందరూ అనుకున్నారు. వైసీపీ నాయకత్వం ఆమెకే 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చింది. ప్రత్తిపాటి పుల్లారావుపై వ్యతిరేకత కూడా కొంత విడదల రజనీకి ప్లస్ అయిందనే చెప్పాలి. జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో రజనీకి అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్యశాఖను జగన్ కు అప్పగించారు.
ఈసారైనా జాగ్రత్త పడకుంటే?
అయతే ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలలో విడుదల రజనీకి ఈసారి చిలకలూరిపేట టిక్కెట్ ఇస్తే గెలుపు కష్టమని తేలింది. దీంతో జగన్ ఆమెను అక్కడి నుంచి మార్చాలని నిర్ణయించారు. చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జిగా రాజేష్ నాయుడుకు ఇచ్చారు. అదే సమయంలో విడదల రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు. ఇక్కడ కూడా బీసీలు అధికంగా ఉండటంతో రజనీ గెలుపు సులువు అవుతుందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తుంది. రజనీ కూడా క్యాడర్ తో పాటు పార్టీ నేతలను కూడా కలుపుకుని పోతే భవిష్యత్ లో నియోజకవర్గాలు మార్చకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. లేకుంటే.. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గానికి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విడదల రజనీకి ఇది ఒక రాజకీయ హెచ్చరిక మాత్రమేననని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే రజనీరాకను ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం నేతలు కూడా స్వాగతించడం లేదు.


Tags:    

Similar News