TDP : క్యాడర్ కు కొంత గ్లూకోజ్ ఇవ్వండి మహాప్రభో

కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీలో క్రమ శిక్షణ అనేది నేడు కనిపించడం లేదు.

Update: 2026-03-07 08:03 GMT

కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీలో క్రమ శిక్షణ అనేది నేడు కనిపించడం లేదు. గతంలో మాదిరిగా ఆ పార్టీ నేతలు ఉండటం లేదన్నది అందరికీ అర్ధమయింది. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చి చేరడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు సీనియర్ నేతలు సయితం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్లను ఖరారు చేసే సమయంలోనే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ఇబ్బందులు తప్పేవి కదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకటి కాదు..రెండు కాదు.. అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ ఎవరిపైనా చర్యలు లేవు. అలాగే ఎవరిని పిలిచి గట్టిగా మందలించిన పాపాన పోలేదని పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

అనేకమంది ఎమ్మెల్యేలపై...
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్ వంటి వారిపై అనేక ఆరోపణలు వచ్చాయి. వీరంతా కొత్త వారేనని గుర్తు చేస్తున్నారు. కొత్తగా ఎమ్మెల్యేలు టిక్కెట్లను పొంది గెలిచిన వారు మాత్రమే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, సీనియర్ నేతలు అందరూ వివాదాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవచ్చు. కానీ ఈ మూడేళ్లలో పార్టీకి జరిగే డ్యామేజీ సంగతేంటని పలువురు తెలుగుదేశం పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియా యాక్టివ్ గా లేక...
మరొకవైపు పార్టీ క్యాడర్ నుంచి కూడా పలు ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. పార్టీ ని పట్టించుకుంటారా లేదా లోకేశ్, చంద్రబాబు నాయుడు ఇలాంటి వి పదే పదే రీపీట్ అవటానికి కారణం మీరే నంటూ వేలు చూపుతున్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు, లోకేశ్ లు కష్టపడి ఎన్ని కంపెనీలు ఆంధ్ర్రప్రదేశ్ కు తెచ్చినప్పటికీ, ఉద్యోగాలను కల్పించినప్పటికీ, రోడ్లు ఎంత అభివృద్ధి చేసిన కూడా లోపం ఎక్కడ ఉంది.? కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా లేదని వారు నిలదీస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లు ఓట్లు వేయించరు,వాళ్ళ మాటలు విని మోసపోకండి మళ్ళీ మళ్ళీ అంటూ పోస్టులు పెడుతున్నారు. గ్రూప్ రాజకీయాలని కట్టడి చేయాలని, పార్టీ కోసం కొంత సమయం కేటాయించాలని కోరుతున్నారు. అలాగే టీడీపీ సోషల్ మీడియా కూడా పెద్దగా యాక్టివ్ గా లేదని, దానికి గ్లూకోజ్ ఇచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. సోషల్ మీడియా వారియర్స్ తో ఒక ఫొటో దిగేతే వారు యాక్టివ్ అవుతారని లోకేశ్, చంద్రబాబునును కోరుతున్నారు. మరి చంద్రబాబు, లోకేశ్ ఏ రకంగా స్పందిస్తారన్నది చూడాలి.


Tags:    

Similar News