Jana Sena : పవన్ వ్యూహం ఈసారి వర్క్ అవుట్ అవుతుందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా ఇప్పుడు కంఫర్ట్ గా ఉన్నారు.

Update: 2026-03-06 07:52 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా ఇప్పుడు కంఫర్ట్ గా ఉన్నారు. ఆయన ఉపముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో సీట్ల ఒప్పందంలోనూ చాలా వరకూ తగ్గారు. పవన్ కల్యాణ్ ఇప్పటికీ అదే మాటమీద ఉన్నారు. మనకు సీట్లు ముఖ్యం కాదని, అధికారంలో ఉండటం, కూటమిని కొనసాగించడం, జగన్ ను అధికారానికి దూరంగా ఉంచటం తన ధ్యేయమని పదే పదే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలను కూడా కొందరు ఉదహరిస్తున్నారు. సీట్ల కోసం కాకుండా ప్రజలకు మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అవసరమైతే తాను ఈసారి కూడా రాజీపడతానని చెప్పడాన్ని చాలా మంది గుర్తు చేస్తున్నారు.

జనసేన నేతల్లో మాత్రం...
కానీ జనసేన నేతల్లో మాత్రం భిన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన తిరుపతి నియోజకవర్గం నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా 70కిపైగా స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. 2024 ఎన్నికలతో పోలిస్తే జనసేన పార్టీ బలం పెరిగిందన్న కిరణ్ రాయల్.. 21 సీట్లే ఇస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేకుంటే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేది కాదన్న కిరణ్ రాయల్.. జనసేన లేకుంటే టీడీపీ ఎలక్షన్ కూడా చేయలేకపోయేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాను టీడీపీ నేతలకు ఛాలెంజ్ చేస్తున్నానని కూడా అన్నారు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో టీడీపీ శ్రేణులు అయోమయ పరిస్థితులలో ఉన్న సమయంలో కూటమి కట్టి.. అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు.
అదే చివరకు ఫైనల్...
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీచేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన జనసేన.. వందశాతం స్ట్రైయిక్ రేట్ నమోదు చేసింది. అనంతరం ప్రభుత్వంలో చేరిన జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు వరించాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. నాదెండ్ల మనోహర్ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా, కందుల దుర్గేష్ ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే జనసేన పార్టీ బలం పెరిగిందని కిరణ్ రాయల్ వంటి వారు అంటన్నా పవన్ కల్యాణ్ మాటలు విన్నవారికి మాత్రం సీట్ల సంఖ్య ముఖ్యంకాదని, తీసుకునే సీట్లలో అన్నీ గెలిచి అధికారంలోకి రావడమే ప్రధానమని ఆయన విశ్వసిస్తున్నారు. సో.. కిరణ్ రాయల్ వంటి నేతల కామెంట్స్ నుపెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. నిర్ణయం ఫైనల్ గా పవన్ దే కావడంతో ఆయన ఏనిర్ణయం తీసుకుంటే అదే అమలు జరిగి తీరుతుంది.


Tags:    

Similar News