Andhra Pradesh : కులం నుంచి మతం వైపునకు ఏపీ వెళుతుందా?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ను వదిలిపెట్టడం లేదు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ను వదిలిపెట్టడం లేదు. గత ఏడాది నుంచి లడ్డూ కేంద్రంగానే వివాదాలు నడుస్తున్నాయి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో రాజుకున్న వివాదం నేటికీ ఆగలేదు. చంద్రబాబు నేషనల్ డెయిరీ డెవలెప్ మెంట్ బోర్డు చెప్పిన దానినే తాను చెప్పానని తర్వాత అన్నారు. సుప్రీంకోర్టు సీబీఐ తో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేసి నివేదిక అందించిన తర్వాత కూడా వివాదం మాత్రం ఆగలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ మత ప్రభావం లేదు. కేవలం కుల ప్రభావం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే..కులం నుంచి మతాలకు ఆంధ్రప్రదేశ్ కూడా షిఫ్ట్ అయ్యేటట్లు కనిపిస్తుంది.
వదిలిపెట్టకుండా...
ఇటు తెలుగుదేశం పార్టీ, అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ లడ్డూ వివాదాన్ని వదిలి పెట్టడం లేదు. కూటమిలో ఉన్న జనసేన పార్టీ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. తొలినాళ్లలో కొంత దూకుడుగానే ఈ అంశంపై వ్యవహరించిన జనసేనాని పవన్ కల్యాణ్ తర్వాత మాత్రం కొంత తగ్గినట్లే కనిపిస్తుంది. లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని, అయితే కల్తీ అప్పటి ప్రభుత్వ పెద్ద చేశారని తాను ఎన్నడూ అనలేదని, ఇందుకు పాలకమండలి, అధికారులే బాధ్యతవహించాలని చెప్పడం చూస్తుంటే.. ఆయన ఒకరకంగా ఈ వివాదం నుంచి కొంత తప్పుకున్నారనే అనుకోవాలి. తొలుత లడ్డూ వివాదం తలెత్తిన వెంటనే ఆలయ మెట్లను శుభ్రం చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు రూటు మార్చారు.
బీజేపీ దూరంగానే...
ఇక కూటమిలోని మరొక మిత్ర పక్షం బీజేపీ తొలి నుంచి ఈ వివాదానికి దూరంగానే ఉంది. నేటికి కూడా లడ్డూ వివాదంలో మాట్లాడేందుకు ఆ పార్టీ నేతలు ఇష్టపడటం లేదు. ఇక శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మండలి ఛైర్మన్ పై చేసిన వ్యాఖ్యలు మరింత కాక రేపాయి. ఒక మతం పేరు ప్రస్తావిస్తూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలతో మండలి వాయిదా పడింది. లడ్డూ అంశం ఇప్పటికే రచ్చ రచ్చ అయి వెంకటేశ్వరస్వామి ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుని, ఇక లడ్డూ వివాదానికి రాజకీయ పార్టీలు ఫుల్ స్టాప్ పెట్టకపోతే చివరకు నష్టపోయేది ఎవరన్నది జనమే తేలుస్తారు. ఆ విషయాన్ని మరిచి ఒక మతం ఓటు బ్యాంకు కోసం ప్రయత్నం ఇంకా కొనసాగుతుండటాన్ని పలువురు అభ్యంతరం చెబుతున్నారు.