YSRCP : విజయమ్మ మనసు మారిందా? నిర్ణయం మార్చుకున్నారా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ తిరిగి జగన్ కోసం పనిచేస్తారా? అంటే అవుననే చెబుతున్నారు

Update: 2026-03-06 08:53 GMT

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ తిరిగి జగన్ కోసం పనిచేస్తారా? అంటే అవుననే చెబుతున్నారు. గత ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయిన తర్వాత బెంగళూరుకు మాత్రమే పరిమితమయ్యారు. విజయమమ్మ మాత్రం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇడుపుల పాయలో జగన్ ను కలవడం, పలకరింపులు, ఆప్యాయతలు మామూలే. గత ఎన్నికల్లో జగన్ తరుపున ఎన్నికల ప్రచారానికి విజయమ్మ దూరంగా ఉన్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో అమెరికాలో వైఎస్ షర్మిల తనయుడి వద్దకు వెళ్లి వీడియో కూడా విడుదల చేశారు. అంటే నాటి ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగానే విజయమ్మ పనిచేశారనే చెప్పాలి.

మరోసారి జగన్ ను...
కానీ ఈసారి ఎన్నికల్లో తిరిగి తన కుమారుడు జగన్ ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ముఖ్యమంత్రి అయితే చూడాలని వైఎస్ విజయమ్మ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే బంధువులు, సన్నిహితులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులు కూడా వైఎస్ విజయమ్మకు సూచించడంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు. వైఎస్ షర్మిల రాజకీయంగా ఎదగలేని పరిస్థితి. అన్నా చెల్లెళ్ల మధ్య ఏదైనా విభేదాలుంటే అవి తర్వాత పరిష్కరించుకోవచ్చు. అంతే తప్ప రాజకీయంగా వైఎస్ లెగసీని ఇబ్బందిపెట్టడం మంచిది కాదని పలువురు విజయమ్మకు సూచించినట్లు చెబుతున్నారు. వైఎస్ షర్మిలకు కూడా ఈ విషయంలో నచ్చ చెప్పే బాధ్యతను విజయమ్మపైకి నెట్టారంటున్నారు.
వైఎస్ పై విమర్శలు చేస్తుండటం...
ఏపీలో ఉన్న ప్రభుత్వం కూడా తరచూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై విమర్శలు చేయడాన్ని వారు విజయమ్మకు చెప్పడంతో పాటు జగన్ అధికారంలోకి రావాలంటేతల్లిగా ఆశీర్వచనాలతో పాటు కొంత అనుకూలంగా వ్యవహరించాలని చెప్పినట్లు తెలిసింది. అందుకే విజయమ్మ వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ తరుపున ప్రచారం చేస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్ కు వ్యతిరేకంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయరని, అవసరమైతే, జగన్ స్వయంగా కోరితే ప్రచారానికి వచ్చే అవకాశముంటుందని అంటున్నారు. ఇటీవల ఇడుపులపాయలో వైఎస్ కుటుంబీకులు, పెద్దల మధ్య జరిగిన సంభాషణల్లో ఇది వ్యక్తమయినట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News