Ys Jagan : ఇప్పటికే ముగ్గురు ఎంపీలు.. ఏడుగురు ఎమ్మెల్యేలు అవుట్.. ఇంకెంతమందో?

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు వీడుతున్నారు. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది

Update: 2024-01-23 08:25 GMT

ఏదైనా అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లాలంటే కొంత వెనకడగు వేస్తారు. అందులోనూ సంక్షేమ పథకాలు ఇబ్బడి ముబ్బడిగా పంచిపెడుతున్న ఫ్యాన్ పార్టీలో ఎలా ఉండాలి? ఎన్నికల సమయంలో వచ్చి చేరుతుండాలి. అయితే దీనికి భిన్నంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. అయితే ఇది స్వయంకృతాపరాధమా? లేదా? అన్నది పక్కన పెడితే ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ జగన్ పార్టీకి కోలుకోలేని దెబ్బగానే చూడాలి. జగన్ దీనిని లైట్ గా తీసుకోవచ్చు. పోయేవాళ్లు..పోతారులే అని పట్టించుకోకపోవచ్చు. కానీ జగన్ పార్టీలో ఇంత వ్యతిరేకత ఉందా? అన్నది మాత్రం సామాన్య జనాలకు మాత్రం అర్థం అయి తీరుతుంది.

అందరికంటే ముందుగా...
ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రతిపక్ష పార్టీల కంటే ముందు ఇన్‌ఛార్జుల నియామకం చేపట్టారు. ప్రతిపక్ష పార్టీల కంటే తాను ముందుండి అభ్యర్థులను జనంలోకి తీసుకెళ్లాలన్న వ్యూహం కావచ్చు. కానీ ఆ కసరత్తు వర్క్ అవుట్ అయ్యేటట్లు కనిపించడం లేదు. వారిని వీరిని కాదు.. ఎవరినీ వదలకుండా బయటకు పొమ్మనే విధంగా పార్టీ అధినేత యాక్షన్ ఉంది. అందులోనూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రమ్మనడం.. ఏదో చెప్పడం.. సర్వేలు అనుకూలంగా లేవని చెప్పడం.. స్థానం మార్చేస్తున్నామని చెప్పడం.. దాదాపు నెలన్నర రోజుల నుంచి ఇదే తంతు. ఎవరు మాత్రం ఓపిక పడతారు. ఎందుకుంటారు? ఎవరి రాజకీయ జీవితం వారిది. వారి రాజకీయ భవిష్యత్ ను వారు చూసుకోవడంలో తప్పులేదు. అయినా ఏకబిగిన పీకపారేస్తుంటే ఎవరు మాత్రం మౌనంగా ఉంటారు. తిరగబడతారు. అదే ఇప్పుడు వైసీపీలో జరుగుతుంది.
ఎమ్మెల్యేలను...
ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. అప్పుడే జగన్ గుర్తించాల్సింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్ చేశారు. వారు నేరుగా వెళ్లి టీడీపీ కండువా కప్పేసుకున్నారు. తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరి టిక్కెట్ లేదని చెప్పగానే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా అంతే. తాను ఏదో ఒక పార్టీ నుంచి బరిలోకి దిగుతానని చెప్పి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన బహుశ షర్మిల చీఫ్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగవచ్చు. ఇక సీనియర్ నేత పార్ధసారధి కూడా తనకు సీటు రాదని తేలడంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
పార్టీ నాకక్కరలేదు అంటూ...
ఇక పార్లమెంటు సభ్యులు కూడా అంతే. తొలుత కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తనకు సీటు రాదని చెప్పడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా అంతే. ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా రిజైన్ చేసి నాక్కకర్లేదు ఈ పార్టీ అని చెప్పేసి చక్కా వెళ్లిపోయాడు. మరికొద్ది ఎంపీలు అదే బాటలో ఉన్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు మరోఇద్దరు ముగ్గురు ఎంపీలు కూడా అదే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుంది. ఇంతకీ కీలక నేతలు వెళ్లిపోవడంలో జగన్ తప్పు ఉందా? లేక ఐప్యాక్ ఇస్తున్న నివేదికలా? అన్నది ఇప్పుడిప్పుడే తేలకున్నా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తలపట్టుకుంటే మాత్రం ప్రయోజనం శూన్యం. కానీ ప్రస్తుతం మాత్రం అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీకి రానున్న రోజులు గడ్డుకాలమేనని చెప్పాలి.
Tags:    

Similar News