Telangana : రాజకీయ గురువు వేస్తున్న ఎత్తుగడలకు చెక్ పెట్టాలనేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గడం లేదు.

Update: 2025-12-02 12:34 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గడం లేదు. ఒకవైపు తనకు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో ఏ మాత్రం పోటీ లేదని చెబుతున్నప్పటికీ ఆ రాష్ట్రం ప్రభావం తనపై పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విభజన ఆంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పరిశ్రమల స్థాపన కోసం ఆయన విశాఖను ఎంచుకున్నారు. ఇటీవల పార్ట్ నర్ షిప్ సమ్మిట్ నిర్వహించారు. అన్ని దేశాలూ తిరిగి పారిశ్రామికవేత్తలను స్వయంగా చంద్రబాబు ఆహ్వానించారు. దాదాపు పదమూడు లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రకటించుకుంది. కానీ తెలంగాణపై దీని ప్రభావం పడకుండా వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ నెల 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ను...
తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ ను ఈ నెల 8,9 లో నిర్వహిస్తున్నారు. డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర తొలి ప్రకటన చేయడంతో ఆ తేదీలను దీనికి ఎంచుకున్నారు. అలాగే చంద్రబాబు తరహాలోనే మరొక నగరానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం చేశారు. అక్కడ అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నారు. సైబర్ సిటీని తానే నిర్మించానని చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటున్న విధంగా హైదరాబాద్ లో నాలుగో నగర నిర్మాణం తన హయాంలో జరిగిందని చెప్పుకోవడానికే రేవంత్ రెడ్డి ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. హైదరాబాద్ నగర అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. అయితే మరొక నగరం నిర్మించానన్న ఖ్యాతిని సంపాదించాలన్న ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసి...
ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు వివిధ రంగాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు. సమ్మిట్ లో భాగంగా మూడు వేల డ్రోన్లతో షోను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల్లో ఈ ఏర్పాట్లను చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏపీ లో చంద్రబాబు నాయకత్వ ప్రభావం తెలంగాణపై పడదన్న అభిప్రాయాన్ని కలిగించడానికే రేవంత్ రెడ్డి ఈ గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పెట్టుబడులు కూడా భారీగా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి దీటుగా లక్షల కోట్ల మేరకు ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద గురువు వేస్తున్న ఎత్తులకు శిష్యుడు మరొక రకంగా చెక్ పెడుతున్నట్లు కనపడుతుంది.


Tags:    

Similar News