Andhra Pradesh : టీడీపీ vs జనసేన .. కూటమిలో క్రాక్స్...ఇక్కడ కూడా అంటుకున్నట్లేనా?
కూటమిలోని మిత్ర పక్ష పార్టీలకు ఒకరంటే ఒకరికి పొసగడం లేదు
కూటమిలోని మిత్ర పక్ష పార్టీలకు ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చోట అక్కడ మిత్ర పక్ష ఇన్ ఛార్జులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రధానంగా టీడీపీ, జనసేనల మధ్య అనేక నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తుంది. రాజోలు నియోజకవర్గాన్ని తీసుకుంటే.. ఇక్కడ వరసగా రెండుసార్లు వరసగా జనసేన గెలిచింది. 2019 ఎన్నికలలో కూటమిలో లేకుండానే పోటీ చేసిన జనసేన 175 నియోజకవర్గాల్లో గెలిచి ఒకే ఒక నియోజకవర్గం రాజోలు. పవన్ కల్యాణ్ నాడు గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయినా రాజోలులో రాపాక వరప్రసాద్ గెలిచారు. అంటే ఇక్కడ జనసేన ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతుంది. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన నేతలను చిన్న చూపు చూస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట కూడా టీడీపీ ఇన్ ఛార్జుల ఆధిపత్యం నడుస్తుందన్న ప్రచారం నడుస్తుంది.
ఎమ్మెల్యే vs టీడీపీ ఇన్ ఛార్జి...
అయితే 2024 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి దేవ వర ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాజోలు టీడీపీ ఇన్ ఛార్జిగా గొల్లపల్లి అమూల్య వ్యవహరిస్తున్నారు. గొల్లపల్లి అమూల్యని రాజోలు టీడీపీ ఇన్ ఛార్జిగా నియమించిన తర్వాత రగడ ప్రారంభమయింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడానికి అమూల్యకు పీజీఆర్ఎస్ లాగిన్ ఇచ్చారు. గొల్లపల్లి అమూల్య ఇన్ ఛార్జి అయిన తరువాత మొదటి సారి ఆరు సీఎంఆర్ఎఫ్ చెక్ లు వచ్చాయి. టీడీపీ అధిష్ఠానం లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి ఇవ్వమని అమూల్యను ఆదేశించారు. దీంతో ఒక చెక్ తీసుకొని బళ్ళ ప్రసాద్ ఇంటికి వెళ్లి అందజేశారు.రెండు చెక్కులు పంపిణీ చేసిన తర్వాత జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నుంచి ఆ చెక్కుల పంపిణీ ఆపేయాలని ఆదేశాలు వచ్చాయి.
చిరుద్యోగి పై ప్రతాపం...
దీంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. అయితే వీరిద్దరి మధ్య గొడవలో కడలి పంచాయతీ ఉద్యోగి పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ఉద్యోగం పీకేయాలంటూ అధికారులను ఆదేశించారు. అతనిని ఉద్యోగం నుంచి తొలగించి, అతని వద్ద ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు కూడా తీసేయాలని జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హుకుం జారీ చేశారు. దీంతో జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ ఛార్జి మధ్య ఉన్న గొడవలో ఒక చిరుద్యోగి బలయ్యాడని సోషల్ మీడియాలో విమర్శలకు దిగారు. దీనిపై టీడీపీ నాయకులు నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చిరుద్యోగిని ఎందుకు బలి చేయాలంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పై స్థాయిలో నేతలు సఖ్యతగా ఉన్నా నియోజకవర్గ స్థాయిలో శత్రువులుగా ఉన్నారనడానికి రాజోలు ఘటన ఒక నిదర్శనం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.