Amaravathi : చంద్రబాబు ఆలోచనలకు.. ఆచరణకు పొంతన లేకుండా పోతుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల రాజధాని అమరావతి అనుకున్న సమయానికి పూర్తి అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల రాజధాని అమరావతి అనుకున్న సమయానికి పూర్తి అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అనేక ఇబ్బందులు భవన నిర్మాణాలకు ఆటంకంగా మారుతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా ఏర్పాటయిన ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అయితే వెంటనే అక్కడ సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటి తాత్కాలిక భవనాలను నిర్మించారు. అయితే శాశ్వత భవనాలను నిర్మించాలన్న ఆయన ఆశలు తొలి టర్మ్ లో ఆయనకు అవకాశం చిక్కలేదు. డిజైన్లు ఖరారు చేయడానికే ఎక్కువ సమయం తీసుకోవడంతో ఈలోగా 2019 ఎన్నికల సమయం వచ్చేసింది.
ప్రతిష్టాత్మకంగా తీసుకుని...
2024 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఐదేళ్లు గ్యాప్ రావడంతో ప్రధాని మోదీని మరోసారి అమరావతికి రప్పించి ఆర్భాటంగా అమరావతి పునర్మిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించారు. కానీ పనులు ఒక అడుగు ముందుకు మూడగులు వెనక్కులా పనులు నడుస్తున్నాయి. మొత్తం 39, 700 ఎకరాలు సేకరించినా ఇప్పుడు రాజధానిలో దాదాపు 39 వేల ఎకరాలు పలు సంస్థలకు కేటాయించారు. అయితే నిత్యం తుపానులు, వర్షాలతో అనుకున్నసమయానికి పనులు పూర్తి కావడం లేదు. 2028 మే నాటికి కి పూర్తి చేసేందుకు చంద్రబాబు షెడ్యూల్ పెట్టుకున్నారు.
మూడేళ్లలో పూర్తవుతాయా?
అంటే రాజధాని నిర్మాణ పనులను 2028కి పూర్తి చేసి 2029 ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయించారు. అయితే ఆయన సీఆర్డీఏ అధికారులతో తరచూ సమావేశమవుతూ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నా ఏదో రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమరావతి లో ఇప్పటిదాకా అరవై ఎనిమిది వేలకోట్లు పనులు వివిధ సంస్థలకు ఇచ్చారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలెప్ మెంట్ బ్యాంకు నుంచి రుణాన్ని కూడా తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు ఈ టర్మ్ లో పదిహేడు నెలలు పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన సమయం తక్కువేననిచెప్పాలి. ఎక్కవుగా రానున్నముప్ఫయి నెలల్లో ఎనిమిది నెలలు తుపానులు, వానలు మింగేస్తాయి. కూలీల కొరత కూడా ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. మరి ఎప్పటికి అమరావతి పూర్తవుతుందన్నది అధికారులే స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.