Ayyanna : అయ్యన్న ఆశలు ఇక గల్లంతయినట్లేనా.. అందుకే ఆయనలో హుషారు తగ్గిందా?

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆశలు నెరవేరేటట్లు కనిపించడం లేదు

Update: 2024-01-17 14:00 GMT

ayyannapatrudu, a senior leader in the telugu desam party,

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆశలు నెరవేరేటట్లు కనిపించడం లేదు. ఆయన ఈ ఎన్నికల్లో తన కుమారుడు చింతకాయల విజయ్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించాలని భావించారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించాలని అయ్యన్న పాత్రుడు డిసైడ్ అయ్యారు. తనకు పార్టీ నుంచి కూడా పెద్దగా ఇబ్బంది ఉండదని ఆయన ధీమాగానే ఉన్నారు. పార్టీలో సీనియర్ నేతగా తాను ఉండటంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో గత నాలుగున్నరేళ్ల నుంచి తాను పార్టీ కోసం పడిన కష్టం, తనపై నమోదయిన కేసులను చూసైనా అధినేత తన మాట వింటారని ఆయన అంచనా వేసుకున్నారు.

అనుకున్నది ఒకటి...
తాను నర్సీపట్నం నుంచి శాసనసభకు తన కుమారుడు విజయ్ ను అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని తలిచారు. అయితే రాను రాను అనకాపల్లి సీటు పై మాత్రం క్లారిటీ రావడం లేదు. అధినాయకత్వం వద్ద ఈ విషయాన్ని కదిపినా అటు నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. అందుకు అనేక కారణాలున్నాయి. అనకాపల్లి సీటుపై ఇప్పటికే జనసేనకు అధినేత మాట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ అనకాపల్లి పార్లమెంటు సీటును కోరుతున్నారని తెలిసింది. అక్కడి నుంచి జనసేన అభ్యర్థిని బరిలోకి దించాలని పవన్ భావిస్తున్నప్పుడు ఎంపీ సీటు కావడంతో చంద్రబాబు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పే అవకాశం లేదు. అందుకే అయ్యన్న పాత్రుడు అడిగినా హైకమాండ్ నుంచి మాట రాలేదన్నది అందుతున్న సమాచారం.
గాజుగ్లాసు తరుపున
మరోవైపు కొణతాల రూపంలో కూడా ప్రమాదం ముంచుకొస్తుంది. కొణతాల రామకృష్ణ త్వరలో జనసేనలో చేరబోతున్నారు. కొణతాల రామకృష్ణ ఖచ్చితంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్నే ఎంచుకుంటారు. అందులో డౌట్ లేదు. అదే జరిగితే అనకాపల్లి నుంచి జనసేన అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ బరిలోకి దిగడం గ్యారంటీగా కనిపిస్తుంది. అందుకే అయ్యన్న పాత్రుడు ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారంటున్నారు. తనుపోటీ చేయకుండా నర్సీపట్నం నుంచి విజయ్ ను బరిలోకి దించితే ఎలా ఉంటుందన్న దానిపై కూడా ఆయన తర్జన భర్జన పడుతున్నారు. తాను ఇప్పటికే కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలు చేశాను కాబట్టి వారసత్వంగా కుమారుడికి నర్సీపట్నం సీటు ఇవ్వాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.
లోకేష్ కు ఆప్తుడిగా...
అయితే ముందుగా అనకాపల్లి పార్లమెంటు టిక్కెట్ ను గట్టిగా హైకమాండ్‌ను కోరి కాదంటే నర్సీపట్నం సీటు విజయ్ కు ఇవ్వాలన్న యోచనలో అయ్యన్నపాత్రుడు ఉన్నారు. చింతకాయల విజయ్ కూడా టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆయన నేతృత్వంలోనే నడుస్తుంది. ఆయనపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు విజయ్ అత్యంత ఆప్తుడు. ఈ నేపథ్యంలో విజయ్ కు అనకాపల్లి టిక్కెట్ దక్కుతుందా? పొత్తులో భాగంగా జనసేనకు పోతుందా? అన్న దానిపై చింతకాయల కుటుంబంలో టెన్షన్ నెలకొంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Tags:    

Similar News