వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఎస్సై..హత్యాయత్నం చేసిన నిందితుడు

ఎస్సై మార్గరెట్ ఆర్ముగాన్ని పరీక్షించగా.. మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలింది. దాంతో అతనికి ఫైన్ విధించింది. తనకు ఫైన్..

Update: 2022-04-24 10:44 GMT

తిరునల్వేలి : మద్యం తాగి వాహనం నడిపి, మహిళా ఎస్సై పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఆ మహిళా ఎస్సై దేహశుద్ధి చేసి, కేసు పెట్టింది. దాంతో ఎస్సైపై పగ పెంచుకున్న నిందితుడు.. ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిరునల్వేలి జిల్లా సుత్తమల్లి పోలీస్ స్టేషన్లో మర్గరెట్ థెరిసా ఎస్సైగా పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చి 27న పాలవూరుకు చెందిన ఆర్ముగం (40) అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించి వాహనం నడుపుతూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఎస్సై మార్గరెట్ తన పీఎస్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తోంది.

ఎస్సై మార్గరెట్ ఆర్ముగాన్ని పరీక్షించగా.. మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలింది. దాంతో అతనికి ఫైన్ విధించింది. తనకు ఫైన్ వేయడంతో రెచ్చిపోయిన ఆర్ముగం.. మహిళా ఎస్సై పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎస్సై ఆర్ముగానికి దేహశుద్ధి చేసింది. తనకు ఫైన్ వేయడమే కాకుండా.. దేహశుద్ధి చేసిన ఎస్సై పై ఆర్ముగం అప్పట్నుంచి పగ పెంచుకున్నాడు. ఎలాగైనా మార్గరెట్ ను అంతం చేయాలన్నంత కక్ష పెంచుకున్నాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆర్ముగానికి జాతర ఉత్సవాల రూపంలో అవకాశం వచ్చింది.
ఈ నెల 22 రాత్రి పాలవూరు గ్రామంలో అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల బందోబస్తు కోసం మార్గరెట్ గ్రామానికి వచ్చింది. మార్గరెట్ ను చూసిన ఆర్ముగం వెంటనే కత్తితో ఆమెపై దాడి చేశాడు. కత్తితో గొంతుకోసి గాయపరిచాడు. మెడ, చెంప, ఛాతి భాగాలపై మార్గరెట్ కు గాయాలయ్యాయి. ఎస్సైపై దాడి చేసి పారిపోతున్న ఆర్ముగాన్ని పోలీసులు స్థానికుల సహాయంతో పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఎస్సై మార్గరెట్ ను తిరునల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందజేస్తున్నారు. సీఎం స్టాలిన్ శనివారం ఆమెతో ఫోన్లో మాట్లాడి, పరామర్శించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 5లక్షల రూపాయల సహాయం అందించారు.




Tags:    

Similar News