Israel Beirut Strikes : మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు... బీరూట్ పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు

లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంత నగరాలపై ఇజ్రాయెల్ గురువారం వరుస వైమానిక దాడులు చేసింది

Update: 2026-03-06 01:33 GMT

లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంత నగరాలపై ఇజ్రాయెల్ గురువారం వరుస వైమానిక దాడులు చేసింది. ముందుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారంతా వెంటనే ఇళ్లను ఖాళీ చేసి బయటకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. హెచ్చరిక వెలువడిన వెంటనే బీరూట్ నగరంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రాణాలు కాపాడుకోవాలని భయంతో ప్రజలు నగరం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించడంతో రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. “ప్రాణాలు కాపాడుకోండి… వెంటనే ఇళ్లను విడిచి వెళ్లండి” అంటూ ప్రజలు వెళ్లాల్సిన మార్గాల్ని కూడా ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. కొన్ని గంటల తరువాత బీరూట్ దక్షిణ ఉపనగరాలపై దాడులు ప్రారంభమయ్యాయి.

ప్రజలు ఖాళీ చేయాలంటూ...
ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగిన తర్వాత, బీరూట్ ఉపనగరాల్లోని కొన్ని ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అలాగే లిటాని నది దక్షిణ భాగంలో నివసిస్తున్న ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరిక జారీ చేసింది. అయితే బీరూట్ దక్షిణ ఉపనగరాల మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయాలనే ఆదేశం ఇవ్వడం ఇదే మొదటిసారి. మధ్యప్రాచ్యంలో కొత్త యుద్ధ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేసిన తరువాత హిజ్బుల్లా సోమవారం మొదటిసారి ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ ప్రాంతాలు, బీరూట్ ఉపనగరాలపై బాంబుదాడులు చేసింది.
123 మంది మృతితో...
గురువారం ఖాళీ చేయాలన్న ఆదేశం వచ్చే వరకు జరిగిన ఘర్షణల్లో లెబనాన్‌లో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. 83 వేల మందికిపైగా తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది.ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ హెచ్చరిక చేస్తూ, హిజ్బుల్లా ప్రభావం ఉన్న బీరూట్ దక్షిణ ఉపనగరాలు గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలా మారుతాయని అన్నారు. “మీరు మాపై నరకం తీసుకువచ్చారు… ఇప్పుడు మేము మీపై నరకం తెస్తాం. ఉత్తర ఇజ్రాయెల్ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు” అని ఆయన లెబనాన్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన సమయంలో వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ హెచ్చరికలతో లెబనాన్ ప్రభుత్వం ఆందోళనకు గురైంది. పరిస్థితిని అదుపులో పెట్టేందుకు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌తో అత్యవసరంగా మాట్లాడారు.
ఘర్షణలు వెంటనే ఆగాలని...
మాక్రోన్ ఘర్షణలు వెంటనే ఆగాలని కోరుతూ ప్రకటన విడుదల చేశారు. లెబనాన్‌కు సహాయం పంపుతామని కూడా ప్రకటించారు. హిజ్బుల్లా వెంటనే ఇజ్రాయెల్‌పై కాల్పులు ఆపాలని, ఇజ్రాయెల్ కూడా లెబనాన్ భూభాగంలో పెద్ద ఎత్తున సైనిక చర్యలు చేపట్టకూడదని ఆయన అన్నారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ నాయకులతో మాట్లాడినట్లు తెలిపారు. బీరూట్ దక్షిణ ఉపనగరాల నుంచి పారిపోతున్న హాది కకూర్ అనే వ్యక్తి, “మేము ఎక్కడికి వెళ్లినా మాపై దాడులు చేస్తారేమో అనిపిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్లినా భద్రత ఉంటుందో లేదో తెలియదు” అని అన్నారు.మరో నివాసి యూసెఫ్ నబుల్సీ మాట్లాడుతూ, “మాకు సంబంధం లేని యుద్ధంలో లెబనాన్ చిక్కుకుంది. చాలా మంది ఇళ్లను వదిలి రోడ్డుపై ఉన్నారు. ఇది తప్పు” అని ఆవేదన వ్యక్తం చేశారు. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఘర్షణలు జరుగుతున్నట్లు ఐక్యరాజ్యసమితి శాంతి దళం తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం సరిహద్దు దాటి ముందుకు కదులుతుండగా కాల్పులు, పేలుళ్లు వినిపించాయని పేర్కొంది.
అదనపు సైన్యాన్ని...
ఇజ్రాయెల్ మంగళవారం అదనపు సైన్యాన్ని దక్షిణ లెబనాన్‌కు పంపినట్లు తెలిపింది. అమెరికా మధ్యవర్తిత్వంలో 2024 నవంబర్‌లో జరిగిన కాల్పుల విరమణ తర్వాత కూడా కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతోంది.ఇజ్రాయెల్ సైన్యం ముందుకు కదలడంతో లెబనాన్ సైన్యం సరిహద్దు ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లింది. మరోవైపు హిజ్బుల్లా ఇజ్రాయెల్ సైన్యంపై దాడులు చేస్తున్నట్లు ప్రకటనలు విడుదల చేసింది. క్షిపణితో ఒక ట్యాంకును ధ్వంసం చేసిన వీడియోను కూడా విడుదల చేసింది. బుధవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గురువారం దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరులో మరి ఇద్దరు సైనికులు గాయపడి తరలించబడినట్లు వెల్లడించింది.


Tags:    

Similar News