War Effect : యుద్ధం ఎఫెక్ట్.. నిలిచిపోయిన ఉమ్రా యాత్రికులు.. వేలాది మంది సౌదీ అరేబియాలోనే

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం వల్ల ప్రయాణాలకు ఇబ్బందిగా మారింది

Update: 2026-03-07 05:55 GMT

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం వల్ల ప్రయాణాలకు ఇబ్బందిగా మారింది. ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన అనేకమంది ముస్లింలు అక్కడే ఇరుక్కుపోయారు. ఇంటికి చేరేందుకు ఇతర మార్గాలు వెతుక్కుంటూ ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు తమ యాత్రలను పూర్తిగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇండోనేషియా హజ్‌, ఉమ్రా ఉపమంత్రి దహ్నిల్ అంజర్ సిమంజుంతక్ వివరాల ప్రకారం గురువారం నాటికి సౌదీ అరేబియాలో 58,860 మందికిపైగా ఇండోనేషియా యాత్రికులు నిలిచిపోయారు. హోటల్‌, విమాన టికెట్ల అదనపు ఖర్చుల భారాన్ని తగ్గించేలా సౌదీ అధికారులు, ఎయిర్‌లైన్స్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఆయన చెప్పారు. భద్రతా కారణాలతో మరో సుమారు అరవై వేల మంది యాత్రికులు ఏప్రిల్ వరకు ఉమ్రా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

అదనపు ఖర్చులతో...
ఇది అత్యవసర మానవతా, నిర్వహణ సమస్యగా మారిందని ఆ దేశ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఇక్సాన్ మార్షా తెలిపారు. సౌదీ అరేబియాలో నిలిచిపోయిన యాత్రికురాలు జానిరా ఫారిస్ ఇండోనేషియా ఐన్యూస్ టీవీతో మాట్లాడుతూ తన తిరుగు విమానం రద్దు అయిందని చెప్పారు. ఇప్పుడు మార్చి 12కు మరో విమానంలో ప్రయాణం ఏర్పాటైంది. ఆలస్యాల వల్ల వస్తున్న అదనపు ఖర్చులను భరించలేని యాత్రికులకు ప్రభుత్వం సహాయం చేయాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరికీ హోటళ్లలో అదనపు రోజులు ఉండే స్థోమత ఉండదు. నా పిల్లలు ఇంట్లో ఎదురు చూస్తున్నారు. అందుకే నిరాశగా ఉంది” అని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్తారు. ముఖ్యంగా రమజాన్ నెలలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. హజ్ యాత్రలా కాకుండా ఉమ్రా యాత్రను సంవత్సరంలో ఎప్పుడైనా చేయొచ్చు.
మలేసియా యాత్రికులూ...
మలేసియా కాన్సుల్ జనరల్ మొహమ్మద్ ద్జరైఫ్ రాజా అబ్దుల్ ఖాదిర్ తెలిపిన వివరాల ప్రకారం సుమారు 1,600 మంది మలేసియా ఉమ్రా యాత్రికులు కూడా సౌదీ అరేబియాలో నిలిచిపోయారు. అయితే వారందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు 24 గంటల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జెద్దా, మదీనా నగరాల నుంచి తిరుగు ప్రయాణాల కోసం మలేసియా ఎయిర్‌లైన్స్ తాత్కాలికంగా కొన్ని విమానాలను తిరిగి ప్రారంభించింది. మలేసియా విదేశాంగ శాఖ కూడా తమ పౌరులను, యాత్రికులను స్వదేశానికి తీసుకురావడానికి దౌత్య కార్యాలయాలు, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఎయిర్‌లైన్స్‌తో కలిసి పని చేస్తోంది.
యాత్రల రద్దు...
ఈజిప్టుకు చెందిన 44 ఏళ్ల మాజెడ్ ఖొలైఫ్ ఫిబ్రవరి 28న కువైట్‌కు తిరిగి వెళ్లాల్సి ఉంది. అదే రోజు యుద్ధం ప్రారంభం కావడంతో ఆయన విమానం రద్దు అయింది. కొన్ని రోజుల తర్వాత మాత్రమే మరో విమానం ఏర్పాటు చేశారు. ఉమ్రా యాత్రలో ఆధ్యాత్మిక భావంలో ఉన్న సమయంలో ఇలా పరిస్థితి మారడం కష్టంగా అనిపించిందని ఆయన చెప్పారు. భార్య, అత్తతో కలిసి స్వదేశానికి చేరేందుకు మార్గాలు వెతికారు. చివరకు రహదారి మార్గంలో కువైట్ చేరుకుని పిల్లలను కలుసుకున్నారు. “పిల్లలు కళ్లముందు కనిపించి కౌగిలించుకున్న తర్వాత ఇంకేమీ ముఖ్యం కాదు” అని ఆయన భావోద్వేగంగా చెప్పారు. అమెరికాలోని మిచిగన్ రాష్ట్రానికి చెందిన జావెడ్ ఖిజర్ తన కుటుంబంతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లాలని అనుకున్నారు. టర్కీ, ఖతర్ మార్గంగా సౌదీ అరేబియాకు వెళ్లే ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. కానీ పరిస్థితి క్షీణిస్తున్నట్టు వార్తల్లో చూసి ఆ యాత్రను రద్దు చేసుకున్నారు.“ఇది చాలా కష్టమైన నిర్ణయం. వచ్చే రమజాన్‌కు మళ్లీ వెళ్లే అవకాశం ఉంటుందో లేదో తెలియదు” అని ఆయన చెప్పారు.


Tags:    

Similar News