America : ఇరాన్ పై అమెరికా వదిలిన బాణం ఇదే..దీని శక్తి సామర్థ్యాలు ఏంటో తెలిస్తే?

అమెరికా వాయుసేన అత్యంత శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉంది

Update: 2026-03-05 07:35 GMT

అమెరికా వాయుసేన అత్యంత శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉంది. క్షణాల్లో ప్రత్యర్థులను మట్టికరిపించడంలో అమెరికా వాయుసేనది అందె వేసిన చేయి. ఏ యుద్ధంలో నైనా అమెరికా వాయుసేన దిగిందంటే ఖేల్ ఖతమ్ అనాల్సిందే. గగనతలం నుంచే సముద్రంలోని లక్షల చదరపు మైళ్లను నియంత్రణలోకి తెచ్చుకునే శక్తి దీనికి ఉంది.. ఒక్క యుద్ధంలో నలభై శాతం బాంబులను ప్రయోగించిన చరిత్ర కలిగింది. ఒకరకంగా చెప్పాలంటే యుద్ధ విమానాల్లో అనకొండ లాంటిదని అంటారు. ఆ ఆయుధమే అమెరికాకు చెందిన బి-52 స్ట్రాటో ఫోర్ట్రెస్ బాంబర్. అమెరికా వాయుసేనకు ఇది వెన్నెముక లాంటిది. బి-2 స్పిరిట్లా దీనికి పెద్దగా ప్రచారం లేకపోయినా.. ఇది సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది.

వాయుసేన వద్ద...
అమెరికా వాయుసేన అమ్ముల పొదిలో చాలా పాత బాంబర్ విమానాల్లో బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్ కీలకమైనది. దీనిని 1955 లో అమెరికా వాయుసేన అందుకుంది. మొత్తం 744 విమానాలను తయారుచేయగా.. చివరి బి-52 హెచ్ వేరియంట్ ను 1962లో తయారుచేశారంటే అవెంత పాతవో అర్థం చేసుకోవచ్చు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఈ ఒక్కటి చాలు శత్రువుల స్థావరాలను పసిగట్టి క్షణాల్లో ధ్వంసం చేసి తిరిగి సేఫ్ గా తన భూభాగం మీదకుచేరుకుంటుంది. ఇది ఒక్కటే 20 క్రూజ్ క్షిపణులను ప్రయోగించగలదు. దీనిని అవసరాలకు అనుగుణంగా అమెరికా యుద్ధాల్లో వాడుకొంటోంది. కోల్డ్వర్ వేళ అణ్వాయుధాలను ప్రయోగించగల బాంబర్ గా ఇది భయపెట్టగా.. వియత్నాం యుద్ధంలో చిన్నస్థాయి బాంబర్ లాగా సేవలు అందించింది. తాజాగా ఇరాన్ పై దాడులకు వీటిని రంగంలోకి దించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
వందేళ్లు సేవలందించగల...
ఈ స్ట్రాటోఫోర్ట్రెస్ వందేళ్ల పాటు సేవలు అందించగలవని అమెరికా వాయుసేన అంచనా వేసింది. వీటికి కొత్త ఇంజిన్లను బిగించుకొంటూ 2050 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చని ఇంపీరియల్ వార్ మ్యూజియమ్స్ కథనంలో పేర్కొంది. స్ట్రాటోఫోర్ట్రెస్లు చూడటానికి ఆకారంలో చాలా భారీగా ఉంటాయి. అత్యధికంగా సబ్సోనిక్ వేగంతో 50,000 అడుగుల ఎత్తులో మాత్రమే ఇవి ప్రయాణించగలవు. యుద్ధ రంగంలో వ్యూహాత్మక దాడులు, క్లోజ్ ఎయిర్ సపోర్ట్, కౌంటర్ ఎయిర్, మారిటైమ్ ఆపరేషన్లకు వీటిని వాడతారు. 1990ల్లో ఇరాక్పై చేపట్టిన డిజర్ట్స్ట్రామ్ ఆపరేషన్లో 40 శాతం బాంబులను ఈ విమానాలే ప్రయోగించాయంటే.. అమెరికా వీటిపై ఏ స్థాయిలో ఆధారపడుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇవి అణు, లేజర్ గైడెడ్, క్లస్టర్, బంకర్బస్టర్లు, గ్రావిటీ బాంబులు, జీపీఎస్ గైడెడ్ ఆయుధాలను కూడా ప్రయోగించగలదు. ఒక్కో స్ట్రాటోఫోర్ట్రెస్ విమానం 30 జీబీయూ-31 శ్రేణి బంకర్ బస్టర్లను మోసుకెళ్లగలదు. అదే ఎఫ్-15 ఫైటర్ జెట్ కేవలం రెండు మాత్రమే తీసుకెళ్లగలదు. ఈ విమానాలు ఒక్కసారి గాల్లోకి ఎగిరితే రీప్యూయలింగ్ లేకుండా 14,080 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
రెండు విమానాలు చాలు..
ఈ విమానాలు సముద్ర నిఘా కార్యకలాపాలను కూడా సమర్థంగా నిర్వహించగలవు. కడలిపై కేవలం రెండు బి-52లు గాల్లో ఉంటే 3,64,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏం జరుగుతోందో పసిగట్టగలవు. వీటిపై రెండు ఎలక్ట్రో ఆప్టికల్ వ్యూయింగ్ సెన్సర్లు, ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్, అడ్వాన్స్డ్ టార్గెటింగ్, బ్యాటిల్ అసెస్మెంట్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. దీనిలోని పైలట్లు నైటి విజన్ గాగుల్స్ వినియోగిస్తారు. ఈ విమానాలు వాడాలంటే సుదీర్ఘమైన రన్వే ఉండాలి. అందుకే యూకేలోని ఫెయిర్ఫోర్డ్ స్థావరాన్ని అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు చేసేందుకు వినియోగిస్తోంది. ఇక్కడ 3.2 కిలోమీటర్ల రన్వే ఉంది. ఇక ఇరాన్కు అత్యంత సమీపంలోని డిగో గార్సియా స్థావరం కూడా ఈ విమానాల వాడకానికి అనుకూలం. ఇరాక్ పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ డిజర్ట్ స్ట్రామ్లో భాగంగా 1996 సెప్టెంబర్ 2,3 తేదీల్లో రెండు బి-52 హెచ్లు బాగ్దాద్పై 13 క్రూజ్ క్షిపణులను ప్రయోగించి అక్కడి కమ్యూనికేషన్, విద్యుత్తు కేంద్రాలను ధ్వంసం చేశాయి. ఆ సమయంలో ఈ విమానం లూసియానాలోని బార్క్స్డేల్ స్థావరం నుంచి 34 గంటల పాటు ప్రయాణించి ఈ దాడులు చేశాయి. ప్రస్తుతం దీనిని ఇరాన్ పైకి అమెరికా ప్రయోగిస్తుంది. దీంతో అమెరికా ఇరాన్ ను ఏస్థాయిలో వదలిపెట్టకూడదని నిర్ణయించుకుని దీనిని రంగంలోకి దించింది.


Tags:    

Similar News